అమరావతి: జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు కల్పిస్తూ, భవిష్యత్ నాయకత్వాన్ని సిద్ధం చేసే లక్ష్యంతో కొత్త వ్యవస్థను అమలు చేస్తున్నారు.

రాష్ట్రంలోని 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో “పార్టీ నిర్మాణ సమాచారం సేకరణ కమిటీలు” ఏర్పాటు చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీల ద్వారా పార్టీ బలాన్ని సమగ్రంగా అంచనా వేసి, క్రియాశీలకంగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తల వివరాలను సేకరించనున్నారు.
ఈ కమిటీల ప్రధాన ఉద్దేశం కేవలం సమాచారం సేకరణ మాత్రమే కాకుండా, పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న కేడర్‌ను గుర్తించడం కూడా. నాయకత్వ లక్షణాలు, ప్రజలతో సంబంధాలు, పార్టీ పట్ల అంకితభావం వంటి అంశాల ఆధారంగా సమగ్ర నివేదికలు రూపొందించనున్నారు.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 28 మంది సభ్యులతో ఈ కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో ఒక పరిశీలకుడు, ముగ్గురు సీనియర్ నాయకులు, సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న ముగ్గురు ప్రధాన సభ్యులు ఉండనున్నారు. వీరితో పాటు క్షేత్రస్థాయిలో సమన్వయం కోసం మరో 21 మంది కార్యకర్తలు భాగస్వాములవుతారు.
ఈ కమిటీల రూపకల్పనలో మహిళా విభాగానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వీరమహిళలకు తగిన స్థానం కల్పిస్తూ కమిటీలను సమతుల్యంగా రూపొందించారు. ఈ ప్రక్రియ ద్వారా మహిళా నాయకత్వాన్ని కూడా ప్రోత్సహించాలన్న లక్ష్యం ఉన్నట్లు సమాచారం.
పవన్ కల్యాణ్ స్వయంగా ఈ కమిటీల ఏర్పాటును సమీక్షించి ఆమోదించినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో సేకరించే సమాచారాన్ని ఆధారంగా తీసుకుని, భవిష్యత్‌లో పార్టీ పదవులు, బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు సరైన గుర్తింపు లభించాలన్నదే ఈ చర్య వెనుక ఉన్న ప్రధాన ఆలోచనగా జనసేన వర్గాలు చెబుతున్నాయి. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే కాకుండా, సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేయడమే లక్ష్యంగా ఈ వ్యవస్థను రూపొందించారు.
ఈ కొత్త విధానం ద్వారా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని, అలాగే ప్రజా సమస్యలపై పోరాడే కొత్త నాయకత్వం వెలుగులోకి వస్తుందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.




























