భారత్ లో అడ్డూఅదుపు లేకుండా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. దేశంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు, వందల సంఖ్యలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి. మార్చి నెల తొలివారం నుంచి వ్యాప్తి చెందిన వైరస్ నేటికీ అదుపులోకి రాకపోవడంతో కేంద్రం అంచెలంచెలుగా లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితులకు అనుగుణంగా ఈ ఆంక్షలను అమలు చేస్తున్నాయి.

ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో ఎంతటి వాళ్లైనా ఆంక్షలను, నిబంధనలను ఉల్లంఘించకూడదు. అయితే స్టార్ హీరో అల్లు అర్జున్ తాజాగా కరోనా నిబంధనలను ఉల్లంఘించారని అదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు అల్లు అర్జున్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. పోలీసులు విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని చెప్పారని సమాచారం.

అదిలాబాద్ జిల్లాలో ఉన్న కుంటాల జలపాతం సందర్శనకు గత కొన్ని నెలలుగా అధికారులు అనుమతులు నిలిపివేశారు. అయితే ప్రముఖ మంత్రి చెప్పడంతో అధికారులు అల్లు అర్జున్, పుష్ప సినిమా యూనిట్ సభ్యులకు కుంటాల జలపాతం సందర్శనకు అనుమతులు ఇవ్వడంతో పాటు అధికారులే దగ్గరుండి వాటర్ ఫాల్స్ ప్రత్యేకతను వివరించారు.

జలపాతానికి సమీపంలో ఉన్న తిప్పేశ్వర్ లో అనుమతులు లేకపోయినా పుష్ప సినిమా షూటింగ్ జరిగిందని సమాచార హక్కు సాధన స్రవంతి ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తిక్ రాజు ఆరోపణలు చేశారు. పోలీసులు ఈ కేసు విషయంలో ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది. వీళ్లు అదిలాబాద్ డీ.ఎఫ్.ఓకు కూడా ఫిర్యాదు చేయాలనే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేసి వచ్చేశారు.



























