దుమారాలకు పెట్టింది పేరు టాలీవుడ్. అందులోనూ మన కధానాయికల మధ్య గాసిప్స్ అంటే భలే హాట్ హాట్ గా నెట్ లో హల్ చల్ చేస్తుంటాయనడానికి ఇప్పుడు మీరు చదవబోతున్న అంశమే ఒక చక్కని ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక అసలు విషయానికొస్తే.. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వచ్చిన ఒక పోస్టు తాజాగా దుమారానికి కారణమయింది. ఆ పోస్టులో మజిలీ చిత్రంలోని సమంతా ఫోటోకు ‘సమంత ఏమంత అందంగా లేదు’ అంటూ క్యాప్షన్ జతచేసి ఉంది.

అయితే ఆ పోస్టు పెట్టిన కొద్ది గంటలలో పూజా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తన ఇన్స్టా గ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని, దానిలో వచ్చిన పోస్టులను పట్టించుకోవద్దని ఫాలోవర్లను కోరింది. ఈ విషయంలో తన డిజిటల్ టీమ్ వర్క్ చేస్తున్నారని వివరణ ఇచ్చింది. అలా వివరణ ఇచ్చిన కొంతసేపటికి తన డిజిటల్ టీమ్ కు కృతజ్ఞతలు చెప్తూ పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు చెప్పింది. ఇలా కొందరు ఆకతాయి హ్యాకర్లు చేసిన పనిని సరిదిద్దామనుకునేలోపే కొందరు నెటిజన్లు మాత్రం దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. పూజ హెగ్డే ఖాతా నిజంగా హ్యాకింగ్ కాలేదు. ఇదంతా పూజా ఆడుతున్న డ్రామా అని అనుమానాలు లేవనెత్తారు. పూజా ఖాతాలో పెట్టిన సమంత పోస్టు స్క్రీన్ షాట్ ను జోడిస్తూ ‘సమంతకి ఉన్న క్రేజ్ ను చూస్తుంటే నీకు అసూయగా ఉంది. అందుకే నోరు జారి కామెంట్ పెట్టి ఇప్పుడు కవరింగ్ చేసుకుంటున్నావు అంటూ ఘాటుగానే విమర్శలు గుప్పించారు.

కొంతమంది సమంత ఫాలోవర్లు అయితే మరింత ముందుకెళ్ళి సమంతకు క్షమాపణలు చెప్పాలి అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తూ పూజను ట్రోల్ చేయడం కూడా ప్రారంభించారు. నిజానికి ఈ పోస్టును పూజనే చేసిందో లేక హ్యాకర్లు చేసారో అనేది లోగుట్టు పెరుమాళ్ళకెరుక కానీ ఎక్కువమంది మాత్రం ‘హ్యాకింగ్ లేదు, ఏం లేదు..పూజ కావాలనే చేసింది” అంటున్నారు. అయితే ఈ కామెంట్లపై పూజా నుండి మాత్రం ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అసలు వస్తుందో లేదో కూడా అనుమానమే.!



























