పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ఇటీవలే విడుదలై హిట్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ చిత్రంలో లాయర్ నందగోపాల్ అనే కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు. ఈ పాత్రకు ఎటువంటి స్పందన వస్తుందో తెలియంది కాదు. తాజాగా వకీల్ సాబ్ చిత్రంలోని తన పాత్ర గురించి, అలాగే తన కెరీర్ విశేషాలను ప్రకాష్ రాజ్ మీడియాతో పంచుకున్నారు…ఈ మేరకు ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..

“పవన్ గారి ఆలోచనలకు చాలా దగ్గరైన కథ ఇది. ఆయనకు చాలా రిలవెంట్ సబ్జెక్ట్. ఆయన కొన్ని సంభాషణలు చెబుతున్నప్పుడు అవి మనసులో నుంచే వచ్చాయి అనిపిస్తుంది. మహిళల గురించి సినిమా చేసినా మనకు సాంగ్స్, ఫైట్స్ కావాలి. పవన్ గారి ఇమేజ్ కు అనుగుణంగా సినిమా చేస్తూనే.. అవన్నీ చేర్చారు. దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. పవన్ గారిని చాలా ప్రేమిస్తాను కాబట్టే విమర్శించాను. ఆయనతో రాజకీయంగా నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పవన్ గారు మాట్లాడుతూ… ప్రకాష్ రాజ్ గారితో భిన్నాభిప్రాయాలు ఉన్నా ఆయన అభిప్రాయాలను గౌరవిస్తాను అన్నారు. పవన్ గారు ఒక లీడర్. ఆయన్ను ప్రేమిస్తాను కాబట్టే పవన్ గారు అలా ఉండాలి అని కోరుకుంటాను. పవన్ గారికి, నాకు సమాజం పట్ల, ప్రజల పట్ల కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మహిళల గురించి ఇంకా సినిమాలు రావాలి. పురుషుల్లో మార్పు రావాలి. తల్లిదండ్రులు అబ్బాయిల్ని పెంచేప్పుడే సన్మార్గంలో పెట్టాలి. మహిళల్ని గౌరవించడం నేర్పాలి.
నేను ఈ సినిమాలో అమ్మాయిల్ని బాధ పెడుతూ ప్రశ్నించాను. ఆర్ యూ వర్జిన్ అని అడిగినప్పుడు బాధగా అనిపించింది. అయితే నేను నటుడిని, నా క్యారెక్టర్ ప్రకారం నటించాను. కానీ లోపల బాధగానే అనిపించింది. ఈ చిత్రంలో నివేదా, అంజలి, అనన్య ముగ్గురూ చాలా సహజంగా నటించారు.పవన్ గారు ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఓడిపోయారు. రాజకీయం మనం అనుకునే దాని కంటే సంక్లిష్టమైనది. ఓడిపోయినా ప్రజల కోసం పవన్ గారు నిలబడ్డారు. అదీ గొప్ప రాజకీయ నాయకుడి లక్షణం. పవన్ గారిలో ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు ప్రకాష్ రాజ్..!!



























