Preity Zinta : బాలీవుడ్‌లో తన అందం, నటనతో ఒక వెలుగు వెలిగిన నటి ప్రీతి జింటా గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? ‘వీర్ జారా’, ‘సోల్జర్’ లాంటి ఎన్నో సూపర్‌హిట్ సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఐపీఎల్ సందడిలో మాత్రం కనిపిస్తూనే ఉంది. త్వరలోనే ‘లాహోర్ 1947’ అనే సినిమాతో మళ్లీ వెండితెరపై మెరవనుంది. అయితే, ప్రీతి జింటా గురించి చాలా మందికి తెలియని ఒక గొప్ప విషయం ఉంది. అదేంటంటే, ఆమె సరోగసీ ద్వారా పిల్లల్ని కనడానికి ముందే, ఏకంగా 34 మంది బాలికలను దత్తత తీసుకుని వాళ్ల ఆలనాపాలనా చూసుకుంటోంది! ఇది నిజంగా గొప్ప విషయం కదూ?

ప్రీతి జింటా తన భర్త జీన్ గుడ్‌ఎనఫ్‌తో కలిసి లాస్ ఏంజిల్స్‌లో ఉంటోంది. 2021లో సరోగసీ ద్వారా జై, జియా అనే కవలలకు జన్మనిచ్చింది. కానీ, అంతకు ముందే ఆమె 34 మంది ఆడపిల్లల బాధ్యతను తీసుకుంది. వాళ్ల చదువు, తిండి, బట్టలు అన్నీ తనే చూసుకుంటోంది. ఈ విషయాన్ని ప్రీతి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. “నేను 34 మంది అమ్మాయిలను దత్తత తీసుకున్నాను. వాళ్ల చదువుతో పాటు వాళ్లకు కావలసిన ఆహారం, దుస్తులు అన్నీ నేనే చూసుకుంటాను. వాళ్లు ఎంతో సంతోషంగా ఉంటారు. వాళ్ల మాటలు వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్లంతా నా పిల్లలే, వాళ్ల బాధ్యత నాదే. నేను వాళ్లతో ఎప్పుడూ టచ్‌లో ఉంటాను. సంవత్సరానికి రెండుసార్లు తప్పకుండా వాళ్లను కలుస్తాను” అని ప్రీతి చెప్పింది.
ఆడపిల్లలు సమాజంలో ఎదుర్కొంటున్న కష్టాలు, ఆడ శిశువుల భ్రూణహత్యలు, పేదరికంలో మగ్గిపోతున్న పిల్లల గురించి వార్తలు చదివి ప్రీతి చాలా బాధపడింది. ఆ బాధే ఆమెను ఈ మంచి పని చేయడానికి పురిగొల్పింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని పిల్లలను దత్తత తీసుకోవాలని ఆమె అనుకుంటోంది.
ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు సహ యజమానిగా ఉన్న ప్రీతి జింటా, సన్నీ డియోల్‌తో కలిసి ‘లాహోర్ 1947’ సినిమాలో నటించనుంది. ఈ వార్త వినగానే ఆమె అభిమానులందరూ చాలా సంతోషించారు. ఒకవైపు అమ్మగా తన పిల్లలను చూసుకుంటూనే, మరోవైపు సమాజానికి సేవ చేస్తూ ప్రీతి జింటా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. నిజంగా ఆమె గ్రేట్ కదూ!



























