ప్రేమి విశ్వనాథ్ అంటే మన తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ కార్తీక దీపం వంటలక్క అంటే మాత్రం టక్కున గుర్తు పట్టేస్తారు. అంతలా ‘కార్తిక దీపం’ సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది ప్రేమి. చిన్నా, పెద్దా, ఆడ, మగా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ రాత్రైతే చాలు టీవీలకు అతుక్కు పోయేలా చేస్తోంది మన వంటలక్క. వంటలక్క నట విశ్వ రూపానికి టీఆర్పీ రేటింగ్స్ లో కూడా మరే ఇతర సీరియల్స్ పోటీ పడలేకపోతున్నాయి.

దీప అలియాస్ వంటలక్క క్యారెక్టర్ చేస్తున్న నటి ప్రేమి విశ్వనాథ్ ఈ సీరియల్ ద్వారా ఎంతగా పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కార్తీక దీపం సీరియల్ లో ప్రేమిని చూసినవాళ్ళందరూ ఆమె బయట కూడా ఇలానే ఉంటుందా అనే డౌట్ పడుతున్నారు. కానీ నిజం చెప్పాలంటే అదంతా మేకప్ మహత్మ్యమే.. అందుకే ప్రేమి తన సోషల్ మీడియాలో తన రియల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు షేర్ చేసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే మన వంటలక్క వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని.. బుల్లితెర పైకి రాకముందు ప్రేమి ఏం చేస్తుండేదో అంటూ ఎన్నో సందేహాలతో ఆమె ఫ్యాన్స్ తికమక పడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. So.. మన వంటలక్క పర్సనల్ లైఫ్ గురించి మీరే చదివి తెలుసుకోండి..

ప్రేమి విశ్వనాథ్ కేరళ రాష్ట్రానికి చెందిన బుల్లితెర నటి. స్టార్ మా లో ప్రసారమౌతున్న ‘కార్తీక దీపం’ సీరియల్ తో తెలుగు టీవి రంగంలోకి ప్రవేశించింది. 1991, డిసెంబరు 2న విశ్వనాథ్, కాంచన దంపతులకు కేరళ రాష్ట్రం ఎర్నాకులంలోని ఎడప్పల్లిలో ప్రేమి జన్మించింది. లా కోర్సు కూడా పూర్తి చేసింది. కొచ్చిలోని ఒక సంస్థకు లీగల్ అడ్వైజర్‌గా పని చేసిన ప్రేమికి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే కొన్ని పెళ్ళిళ్ళకు ఫొటోగ్రఫీ చేసింది. కేరళలో బాగా పేరు పొందిన జోతిష్యుడైన డా. టి.ఎస్. వినీత్ భట్ ను ప్రేమి పెళ్ళి చేసుకుంది.

నటనా రంగం లోకి రాక ముందు మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపును సంపాదించిన ప్రేమి, 2013లో ఏసియా నెట్ మలయాళం టెలివిజన్ లో ప్రసారమైన ‘కరతముత్తు’ అనే సీరియల్ ద్వారా టీవి రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ ధారావాహిక మలయాళ టీవి రంగంలో సంచలనాన్ని సృష్టించి, ప్రేమి నటనకి మంచి క్రేజ్ ను తీసుకు వచ్చింది. ఇప్పుడు ఇదే సీరియల్ ‘కార్తీకదీపం’ పేరుతో తెలుగులో రిమేక్ చేయబడి 2017, అక్టోబరు 16వ తేదీ నుంచి స్టార్ మాలో ప్రసారం చేయబడుతుంది. తెలుగులో కూడా ఈ సీరియల్ నెంబర్ 1 స్థానంలో నిలవడం విశేషం. ఆ తర్వాత మరో 2 సీరియల్ లోనూ, 2 తమిళ చిత్రాల్లోనూ నటించింది ప్రేమి.



























