తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరవాసులకు ప్రీపెయిడ్ కరెంట్ మీటర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. మొబైల్ రీఛార్జ్ చేసుకుని టెలీకాం సేవలను ప్రస్తుతం ఏ విధంగా పొందుతున్నామో ఇకపై నగరవాసులు అదే విధంగా ప్రీ పెయిడ్ మీటర్లను రీచార్జ్ చేసుకుంటే మాత్రమే విద్యుత్ ను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. రోజురోజుకు నగరంలో బిల్లులు వేలల్లో పేరుకుపోతూ ఉండటంతో ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

డిస్కం ఉన్నతాధికారులు ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రీ పెయిడ్ మీటర్లను అమర్చగా ఆ సంఖ్యను మరింతగా పెంచాలని భావిస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీ పెయిడ్ మీటర్లు అందుబాటులో ఉండగా త్వరలో ప్రైవేట్ కార్యాలయాల్లో సైతం ప్రీ పెయిడ్ మీటర్లు అందుబాటులోకి రానున్నాయి. డిస్కం అధికారులు తక్కువ విద్యుత్ కనెక్షన్లు ఉన్న డివిజన్లను ఎంపిక చేసుకుని ఆ డివిజన్లలో పూర్తిస్థాయిలో ప్రీపెయిడ్ మీటర్లను అమర్చాలని భావిస్తున్నారు.
వినియోగదారులు ముందుగానే రీచార్జ్ చేసుకుని రీచార్జ్ చేసుకున్న డబ్బులు అయిపోయేంత వరకు విద్యుత్ ను వినియోగించుకునే ఛాన్స్ ఉంటుంది. విద్యుత్ రంగ నిపుణులు భవిష్యత్తులో పూర్తిస్థాయిలో ప్రీపెయిడ్ మీటర్లు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఫలితంగా మొండి బకాయిలకు సులభంగా చెక్ పెట్టవచ్చన్ చెబుతున్నారు. ప్రజలకు సైతం ప్రీపెయిడ్ మీటర్ల వల్ల ఒకింత ప్రయోజనం చేకూరనుంది.
చాలామంది కరెంట్ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల జరిమానాలను చెల్లిస్తున్నారు. అయితే ప్రీపెయిడ్ మీటర్లు అందుబాటులోకి వస్తే మాత్రం జరిమానాల సమస్య కూడా ఉండదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ మీటర్లు సత్ఫలితాలు ఇచ్చాయని స్వయంగా అధికారులు చెబుతూ ఉండటం గమనార్హం.































