అమరావతిలో జరిగిన భూ సమీకరణ అంశంలో జగన్ ప్రభుత్వంపై మాజీ సహాయ మంత్రి, సినీ నటుడు కృష్ణం రాజు, నిర్మాత అశ్వనీదత్ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దెందుకు చుట్టుపక్క భూములను తీసుకుంది. వాటికీ బదులుగా అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చేందుకు ఒప్పుకుంది. అలాగే అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చింది, అయితే ఒక్కసారిగా ప్రభుత్వం మారడంతో రాజధాని మార్పుకోసం సన్నాహాలు చేస్తుంది. 3 రాజధానుల ప్రతిపాదనతో వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. దింతో అమరావతి ప్రాంతంలో వీరికి కేటాయించిన భూమి విలువ పూర్తిగా తగ్గిపోయింది.

దీంతో 31 ఎకరాలు విమానాశ్రయానికి ఇచ్చిన కృష్ణం రాజు, 39 ఎకరాలు ఇచ్చిన అశ్వినీదత్ ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. తనకు 210 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఫిటిషన్ లో పేర్కొన్నారు. వీళ్లిద్దరి పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు… కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ సందర్బంగా ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన 3 రాజధానుల ప్రతిపాదనను సినీ నటుడు చిరంజీవి స్వాగతించడాన్ని సినీ నిర్మాత అశ్వనీదత్ తప్పుబట్టారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… “3 రాజధానుల విషయంలో చిరంజీవి చేసిన కామెంట్స్ ను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని, చిరంజీవికి ఏం తెలుసని 3 రాజధానులు బాగుంటుందని చెప్పారని, ప్రపంచంలో బహుళ రాజధాని వ్యవస్థ ఫెయిలైన విషయం ఆయనకు తెలియదా.? పవన్‌కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే కోట్లలో సంపాదిస్తారని సినిమాలు వదిలేసి రైతుల కోసం ఎందుకు పోరాడుతున్నాడో చిరుకు తెలియదా.? జగన్ వాళ్ల నాన్న చేసిన దాంట్లో 10 శాతం చేసినా గొప్ప సీఎం అవుతారని, ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్లు సూపర్ స్టార్లుగా ఉన్నారని, నటుడిగా కాకున్నా.. సగటు మనిషిగా స్పందించాల్సిన అవసరం లేదా అని అశ్వనీదత్ పరోక్షంగా కామెంట్స్ చేశారు.
గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములిస్తే ప్రతిఫలంగా రాజధానిలో భూములిచ్చారని.. ఎయిర్ పోర్ట్ విస్తరించారని.. ఆ భూములను ఎలా తిరిగిస్తారని అశ్వనీదత్ ప్రశ్నించారు. 151 సీట్లు ఇచ్చిన ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని అశ్వనీదత్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ రాజధానిలో నెలకొన్న పరిణామాలపై అశ్వనీదత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని రైతులను చూస్తే ఆవేదన కలుగుతోందని చెప్పారు. గ్రామాల్లో ఉన్నది పోలీసులు కాదని, పోలీసు డ్రెస్‌లో ఉన్న గూండాలని ఆయన మండిపడ్డారు. భూములిచ్చిన రైతులకు బహుమానంగా ఒక్కో ఇంటికి 10 మంది పోలీసులను పెట్టారా అని ప్రశ్నించారు. మహిళలపై లాఠీచార్జ్ చేశారని.. ఏ సమాజంలో ఉన్నామో అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డీజీపీ సవాంగ్ తన మిత్రుడని, ఆయన హయాంలో ఇలా జరగడం దురదృష్టకరమని అశ్వనీదత్ కామెంట్ చేశారు
































