ఇళయరాజా.. ఈ పేరు తెలియని సంగీత ప్రియులు వుండరు. సినిమా ప్రేమికులు వుండరు. సినీ సంగీతానికి కొత్త వన్నె తీసుకొచ్చి తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞాని. చిత్రపరిశ్రమలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సంగీత దర్శకుడు ఇళయరాజా-ప్రసాద్ ల స్టూడియో వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

ఎల్‌వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్ పై ఇళయ రాజా తాజాగా పోలీసు కేసు నమోదు చేశారు. సాయి, అతని మనుషులు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, తన స్టూడియోను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రసాద్ స్టూడియోలోని తన సూట్ లోకి ప్రవేశించి మరీ సంగీత వాయిద్యాలు, నోట్లు, ఇతర పరికరాలను ధ్వంసం చేశారని, తన విలువైన వస్తువులను అధిక మొత్తానికి విక్రయించుకున్నారని చెన్నై కమిషనర్‌కు కంప్లైంట్ ఇచ్చారు ఇళయరాజా. సాయి, అతని అనుచరులపై శాశ్వత ఆంక్షలు విధించాలని కోరుతూ సిటీ సివిల్ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసినట్లు ఈ సందర్భంగా ఇళయరాజా వివరించారు. ఈ కేసు పెండింగ్‌లో ఉండగానే తనపై దౌర్జన్యం చేసి, బలవంతంగా స్టూడియోను లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని, స్టూడియోలో తన కార్యక్రమాలకు అడ్డొస్తున్నారని ఈ నేపథ్యంలో సాయి ప్రసాద్, అతని అనుచరులపై క్రిమినల్. చర్యలు తీసుకోవాలని ఇళయరాజా డిమాండ్ చేశారు. ఇదిలా వుండగా. చెన్నైలోని ప్రసాద్ స్టూడియోస్ స్థాపకుడు ఎల్‌వీ ప్రసాద్, ఇళయ రాజాపై గౌరవంతో ప్రత్యేక గది ఉన్న స్టూడియో స్థలాన్ని
బహుమతిగా ఇచ్చారు.

ఇక్కడున్న రికార్డింగ్ స్టూడియోలోనే గత 40 సంవత్సరాలకు పైగా ఆయన తన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఎల్‌వీ ప్రసాద్ కుమారుడు రమేష్ ప్రసాద్ ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పకపోగా, మనవడు సాయి ప్రసాద్ మాత్రం స్టూడియోను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న వివాదం ప్రస్తుతం నడుస్తుంది. ఇదే అంశంపై తాజాగా ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ స్పందించి సంగీత దర్శకుడు ఇళయరాజా అరాచకాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయని సంచలన కామెంట్స్ చేయడం విశేషం. వివరాల్లోకి వెళ్తే..

ఓ చిత్రానికి పాట కంపోజ్ చేసినపుడు ఆ పాటకు సంబంధించిన కాపీరైట్స్ ప్రతీ రూపాయి ఖర్చు పెట్టిన నిర్మాతకే ఉంటాయని చెప్తున్నాడు ప్రసాద్. కానీ ఇళయరాజా మాత్రం అలా కాకుండా తన పాటలు బయట ఎవరు పాడినా వాళ్ళపై కేసులు పెడతానని.. తను కంపోజ్ చేసిన పాటల కాపీ రైట్స్ తనకే సొంతమని చెప్పడం కరెక్ట్ కాదని, గతంలో కూడా ఇలాగే ఎస్పీ బాలుపై కేసు వేసి అభాసుపాలయ్యాడని, ఆ తర్వాత ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యారని, ఇళయ రాజాకు మంచి క్రేజ్ ఉన్న రోజుల్లో నిర్మాతలను భయపెట్టి ఆడియో రైట్స్ కూడా రాయించుకున్నాడని తన సొంత ఆడియో కంపెనీని ఓపెన్ చేసి ఇప్పుడు లాభాలు పొందుతున్నాడని, అయితే చెన్నై ప్రసాద్ స్టూడియోస్ లో ఉన్న రికార్డింగ్ థియేటర్ తనదే అని ఇళయరాజా చెప్పడం మాత్రం అన్యాయం అని, ఓ సీనియర్ నిర్మాతగా.. ఇళయరాజాకు సంబంధించిన అన్ని విషయాలు తనకు తెలుసు కాబట్టే తాను మాట్లాడుతున్నానని.. అప్పట్లో ఇళయ రాజాయే స్వయంగా వెళ్లి ఎల్వీ ప్రసాద్ ను అడిగితే ఆయనే ఓ రికార్డింగ్ థియేటర్ కట్టించి ఇచ్చాడని కాబట్టి ఆ ధియేటర్ పై ఇళయ రాజాకు ఎలాంటి హక్కులు లేవని.. అది ఎన్ని రోజులు వాడుకుంటే దాని రెంట్ నిర్మాతలు కట్టేవాళ్లని, అది ఇళయరాజా సొంత ఆస్తి అని ఏ రోజు ఎల్వీ ప్రసాద్ చెప్పలేదని, ఇప్పుడు ఇళయరాజా గతాన్ని మరిచిపోయి ఆ రికార్డింగ్ థియేటర్ తనదే అని చెప్పడం భావ్యం కాదని.. ఎల్వీ ప్రసాద్ మనవడిపైనే కేసు పెట్టడం సరైన పద్ధతి కాదని, ఇళయారాజా అరాచకాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయని, అనవసరపు రాద్ధాంతం చేయకుండా కేసు వెనక్కి తీసుకుంటే ఆయనకు మర్యాదగా ఉంటుందని తెలియజేశాడు కాట్రగడ్డ ప్రసాద్.



























