Producer Natti Kumar : సైనిమా ఇండస్ట్రీలో ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. చొరవ చూపి పంచాయితీ చేసే పెద్దమనుషులు కరువవడం, ఇండస్ట్రీలోకి రాజకీయాలు ప్రవేశించడం అలాగే రాజకీయ నాయకుల జోక్యంతో ఇండస్ట్రీలో రోజుకో గొడవ బయటకు వస్తోంది. తాజాగా నిర్మాతల మండలి ఎన్నికల సందర్బంగా నిర్మాతల మండలి ఎన్నికలు అసలు జరుగుతాయా అనే సందేహాల నడుమ సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన నట్టి కుమార్ గారు ఆసక్తికర వాఖ్యలను చేసారు.

ఆలీ, పోసాని వల్ల ఎవరికీ ఉపయోగం లేదు…
నిర్మాతల మండలి ఎన్నికల గురించి మాట్లాడుతూ నట్టి కుమార్ కొంతమంది బడా నిర్మాతలు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలిపారు. యాక్టీవ్ గా ఉన్న నిర్మాతలు అనగా సినిమాలను తీస్తూ ఇప్పుడు ఇండస్ట్రీలో యాక్టీవ్ గా ఉన్న పెద్ద నిర్మాతలు ఒక 20 మంది కలిసి నిర్మాతల మండలి కాదని గిల్డ్ అంటూ సపరేట్ గా ఒక మండలి పెట్టుకున్నారు. యాక్టీవ్ గా లేని పాత నిర్మాతలను తీసేయాలని, వాళ్లకు మెడికల్ క్లెయిమ్ ఎందుకు ఇవ్వాలని, మేము సంపాదించిన డబ్బు ఖాళీగా ఉన్న నిర్మాతలకు ఎందుకు పెట్టాలంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎన్నికల సందర్బంగా వచ్చి వాళ్లకు ఓట్లు వేయాలని మళ్ళీ అదే పాత నిర్మాతలను అలాగే చిన్న నిర్మాతలను అడుగుతున్నారు, ఇదెక్కడి న్యాయం అంటూ నట్టి ఫైర్ అయ్యారు. కొంతమంది చిన్న నిర్మాతలను లొంగదీసుకుని మళ్ళీ నిర్మాతల మండలిలోకి రావాలని చూస్తున్నారు.

ఎన్నికలలో వాళ్లకు అనుకూలమైన వాడిని గెలిపించుకునే ప్రయత్నాలను మొదలు పెట్టారు. అయితే నేను చెప్పేది ఒకటే, అలా రావాలనుకుంటే ఆ గిల్డ్ ను క్లోజ్ చేసి తీసుకెళ్లి పోయిన డబ్బంతా తెచ్చి మెడికల్ క్లెయిమ్ కోసం పెట్టి మళ్ళీ రావాలి. ఎంతో మంది సీనియర్ నిర్మాతలకు మెడికల్ క్లెయిమ్ అనేది ఒక ఉపయుక్తమైన పథకం, బయట ఆరోగ్యశ్రీ ఎలానో ఇండస్ట్రీ వారికి మెడికల్ క్లెయిమ్ అలా, అది దాసరి గారు పెట్టారు. దాన్ని తీసేయాలని వీళ్ళు చూస్తున్నారు. అలానే చిన్న నిర్మాతలను తొక్కేయాలని చూస్తున్నారు. ఇప్పటికీ నా లాంటి చిన్న నిర్మాతలను రానివ్వకుండా చేస్తున్నారు, మమల్ని చంపేస్తారా.. ఈరోజు మీకు బాగుండొచ్చు కానీ రేపు మీరు యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గా ఉండనప్పుడు మీ పరిస్థితి అదే అవుతుంది. ఏపీ ప్రభుత్వం నియమించిన పోసాని, అలీ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు, వాళ్ళు ఇండస్ట్రీకి చేసిన మేలు లేదు అంటూ తీవ్ర వాఖ్యలను నట్టి చేసారు.



























