గతంలో తెలుగు చిత్ర పరిశ్రమ పరిస్థితి ఎలా ఉండేదంటే.. ఒక సినిమా ఫ్లాప్ అయ్యిందంటే ఆ డైరెక్టర్ ను వెంటనే పిలిచి మరో ఛాన్స్ ఇచ్చి ప్రోత్సాహించే వారు హీరోలు. సూపర్ స్టార్ కృష్ణ, ANR, NTR కాలంలో ఈ పద్ధతి కొనసాగేది.

ఆ తర్వాత అదే పద్ధతిని మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్యలు కూడా కొనసాగించారు. కాని నేటి న్యూ జనరేషన్‌లో రవితేజ లాంటి ఒకరిద్దరు తప్పితే మిగిలిన స్టార్ హీరోలు ఫ్లాప్ దర్శకుల్ని పట్టించుకోవడమే మానేశారు. హిట్ కొట్టినవాడే హీరో.. ఫ్లాప్ పడిందో ఆ దర్శకుడు జీరోనే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ చెప్పుకోదగ్గ ట్విస్ట్ ఏమిటంటే.. ఏ డైరెక్టర్ వల్లనైతే తమకు స్టార్ డమ్ వచ్చిందో ఆ డైరెక్టర్ కి ఒక ఫ్లాప్ పడేసరికి ఇక అతడితో పని లేదని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. మంచి దమ్మున్న కథతో వచ్చినా.. ప్రజెంట్ హిట్ లిస్ట్ లో ఉన్నాడా లేడా.? అన్నదే ప్రధానంగా చూస్తున్నారు హీరోలు. తాజాగా ఇదే అంశంపై డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవ్వడంతో టాలీవుడ్ ప్రముఖులందరూ ఇప్ఫుడు పూరీ కామెంట్స్ కోసమే చర్చించుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాలా కాలం తర్వాత మరో హిట్ అందించారు. ‘టెంపర్’ చిత్రం తర్వాత సరైన హిట్ లేక ‘ఇస్మార్ట్ శంకర్’ వరకు వేచి చూడాల్సి వచ్చింది. మొత్తానికి కాస్త లేటైనా లేటెస్ట్ గా హిట్ దక్కడంతో పూరి పండుగ చేసుకున్నాడు.

నెక్స్ట్ సినిమా ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నాడు. అదే పూరి డ్రీం ప్రాజెక్ట్ ‘జనగణమన’. ఈ చిత్రాన్ని మొదట్లో ప్రిన్స్ మహేష్ బాబుతో చేద్దామనుకున్నాడు. కానీ, పూరికి మహేష్ ఆ ఛాన్స్ ఇవ్వలేదట. గతంలో పూరితో మహేష్ బాబు పోకిరీ, బిజినెస్ మ్యాన్ చిత్రాల్లో నటించారు. ఆ 2 కూడా ఆల్ టైం రికార్డు సొధించాయి. ఈ నేపథ్యంలో మహేష్ తో 3వ సినిమా చేయమని ఫ్యాన్స్ అడుగుతున్నారని ‘జనగణమన’ కధ సిద్ధం చేశాడు పూరి. అయితే మహేష్ బాబు ఛాన్స్ ఇవ్వకపోవడంతో ప్రజెంట్ హిట్స్ లో ఉన్న డైరెక్టర్లకే మహేష్ ఛాన్స్ ఇస్తాడని అర్ధం చేసుకున్నాడు పూరి. ఈ పరిస్థితి చూస్తే.. టాలీవుడ్ డేంజర్ జోన్‌లో పడుతుందనే ఫీలింగ్ పూరీకి కలిగింది. “నేను రాసుకున్న కథకు వీళ్లే కరెక్ట్ గా సూటవుతారని కాకుండా.. ముందు సినిమా తీయాలని రాసుకుంటాను.

సాధారణంగా ఒక కథ ఒక హీరోకైతే బాగుంటుందని అందరూ అనుకుంటారు. కాని అన్ని సందర్భాల్లో అది సాధ్యపడదు. కాబట్టి నా కథ ఎవరికి నచ్చితే వాళ్లతో సినిమా చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను. మహా అయితే మార్కెట్ డౌన్ అవుతుంది. స్టార్ హీరోతో చేసిన దానికి కొత్త హీరోతో చేసిన దానికి డబ్బుల్లో తేడాలొస్తాయేమో కాని.. ఔట్ పుట్.. ఆడియన్స్ రిసీవింగ్ మాత్రం మారదు. కాని ఇలా సినిమా తీయడం వల్ల మనకో క్యారెక్టర్ ఉంటుంది. నీకోసమే నేను వెయిట్ చేస్తున్నా.. నువ్ లేకపోతే నాకు దిక్కులేదు అనే మాట నా లైఫ్ లో లేదు.. రాదు కూడా.! ఈసారి కొత్తవాళ్లతోనే సినిమా తీసి తప్పకుండా హిట్ కొడతాను.. సినిమా ఉంటే నేను ఖాళీగా ఉండను. ఉదయం 5 గంటలకు అలారం పెడితే 4 గంటలకే లేచి 5 ఎప్పుడౌతుందా.? అని ఎదురుచూస్తుంటాను. పని ఉంటే నాకు నిద్రే పట్టదు. పనిచేస్తేనే యాక్టివ్‌గా ఉంటాను. నా సినిమాల్లో ఫిలాసఫీ ఉంటుంది. నాకు అవి ఉంటేనే ఇష్టం.” అని ఈమధ్య మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తెలియ జేశారు పూరి జగన్నాథ్.



























