Raghu Rama Krishnam Raju : ప్రస్తుతం రాజకీయాలన్నీ చిన్న ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. మొన్నామధ్య అమిత్ షా కొమరం భీమ్ పాత్రలో బాగా నటించాడని ఎన్టీఆర్ ను పిలిచి అభినందించాను అంటూ చెప్పినా ఇందులో ఏదో ఉంది అంటూ అందరూ అనుకున్నారు. బీజేపీ తో ఎన్టీఆర్ కలిసి పనిచేస్తాడు అంటే మరికొంతమంది తెలంగాణలో బీజేపీ కి ఎన్నికల్లో ప్రచారం చేస్తాడు అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. దీనికి తోడు బిజెపి వాళ్ళు ఒక మాట చెబుతుంటే ఇతర పార్టీల వాళ్ళు పొంతన లేకుండా వేరే చెబుతున్నారు. ఇక ఇపుడు వైసీపీ లోనే ఉంటూ స్వపక్షం లో విపక్షంలా ఉండే ఎంపీ రఘురామ కృష్ణంరాజు తాజాగా ఎన్టీఆర్ బీజేపీ సంబంధాలపై మాట్లాడారు.

ఎన్టీఆర్ బీజేపీ వైపు చూడడు… టీడీపీ కి రావాలంటే 20 ఏళ్ళు…
తలా ఒకమాట అందరూ చెప్తూ ఈ భేటీ వెనుక అంతర్యాన్ని పక్కదారి పట్టించేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్ రావు మాట్లాడుతూ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ రాజకీయ ప్రయోజనాల కోసమే అంటూ స్పష్టం చేసి ఆయన సేవలను తెలంగాణలో ఉపయోగించుకుంటాం అంటూ చెప్పారు. ఇక సోము వీర్రాజు కుడా అత్యంత జనాధరణ కలిగిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆయన సేవలను పార్టీకి వినయోగించుకుంటామని చెప్పారు. టీడీపీ తో మా విధానం మారదని జనసేన మాత్రమే మిత్రపక్షం అంటూ చెప్పారు.

ఇక ఇప్పుడు ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ బీజేపీ వైపు ఎన్టీఆర్ చూస్తే ఆ పారీ కి ప్రచారం చేయడం లాంటివి చేస్తే ఆయన ఒక వర్గం అభిమానులను కోల్పోతారు, ఆయన అలా చేయరని అనుకుంటున్నాను అని చెప్పారు. ఇక టీడీపీ వైపు చూడటానికి జూనియర్ కి ఇంకా టైం ఉందని ఇంకో 20 ఏళ్ల తరువాత రాజకీయాల గురించి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బీజేపీ ఆదినాయకత్వంలోని ముఖ్యనేతలతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు.


































