ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు భారీ సర్‌ప్రైజ్ అందింది. ఆయన హీరోగా, అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి ‘రాకా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ పోస్టర్ బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఫస్ట్ లుక్‌లో అల్లు అర్జున్ పూర్తిగా భిన్నమైన గెటప్‌లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గుండుతో, ఒంటిపై ప్రత్యేక గుర్తులు, చెవిపోగులతో రఫ్ లుక్‌లో దర్శనమిచ్చారు. ముఖ్యంగా ఓ క్రూర జీవిని తలపించే చేయి ఆయన ముఖాన్ని కప్పి ఉండటం కథపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోస్టర్ చూస్తే ఈ చిత్రం సాధారణ కమర్షియల్ సినిమాకంటే భిన్నంగా ఉండబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ స్థాయి బడ్జెట్‌తో పాన్ వరల్డ్ మూవీగా రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు పని చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
ఇక హీరోయిన్ విషయానికి వస్తే, దీపికా పదుకొణే పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రమ్యకృష్ణ వంటి ప్రముఖులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘రాకా’ అనే టైటిల్‌కి క్రూరత్వం, శక్తి వంటి అర్థాలు ఉండటంతో, ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఎలా ఉండబోతుందన్నదానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రనా? లేక ఫాంటసీ నేపథ్యంలో సాగే కథనా? అనే సందేహాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
మొత్తానికి, పుట్టినరోజు రోజునే టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి చిత్రబృందం అభిమానులకు ప్రత్యేక కానుక అందించింది. ‘రాకా’తో అల్లు అర్జున్ మరోసారి కొత్త ప్రయోగంతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నాడనే అంచనాలు పెరుగుతున్నాయి.



























