మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు..చిరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒక పక్క తన సినిమాలతో అభిమానులను అలరిస్తుండగా.. మరోపక్క ఆయన భార్య ఉపాసన మెగా ఫ్యామిలీ వ్యాపారలావాదేవీలు, కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ బిజీబిజీగా వుంటుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేటువంటి ఉపాసన తాజాగా మెగా ఫ్యాన్స్ తో తన కుటుంబానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది.

చెర్రీతో పెళ్లైన కొత్తలో కొన్ని విషయాల్లో ఇబ్బందులు పడ్డానని.. తానిష్టపడిన ఓ సెలబ్రిటీని పెళ్లి చేసుకోవడం తన అదృష్టమని చెప్పిన ఉపాసన, పెళ్లి అయ్యాక అడ్జెస్ట్ అవ్వడం నేర్చుకున్నానని తెలిపారు. ఇక చెర్రీతో పెళ్లి తరువాత మీడియా ఫోకస్ తమపై ఎక్కువగా ఉండటం, తన మీద ట్రోల్స్ రావడం వంటి విషయాలు తనను చాలా ఇబ్బంది పెట్టాయని ఉపాసన తెలియజేశారు. ఆ తరువాత వాటికి అలవాటు పడ్డ తాను, నిదానంగా వాటిని పట్టించుకోవడం మానేశానని, ఈ విషయంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇచ్చిన సలహాలు తనకు బాగా పనిచేశాయని ఉపాసన చెప్పుకొచ్చారు.

ఇక సినిమాల్లోనూ, ఇంట్లోనూ చెర్రీకి చాలా తేడా ఉంటుందని.. తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటామని, ఒకరి వృత్తిని మరొకరు గౌరవించుకుంటామని ఆమె తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితం అవ్వడం వలన ఇద్దరికీ ఎంజాయ్ చేసే సమయం దొరికిందని ఉపాసన తన మనోభావాలను వెల్లడించారు. చదివారుగా మెగా కోడలి ముచ్చట్లు.. మరి లాక్ డౌన్ సందర్భంగా మీకూ ఖాళీ సమయం దొరికితే మీరూ మీ ఫ్యామిలీ తో బాగా ఎంజాయ్ చేసేయండి.



























