Ram Gopal Varma : ప్రస్తుతం వివాదాలతో బ్రతికేస్తున్న ఆర్జీవి ఒకప్పుడు మాత్రం మంచి సినిమాలను తీసి శభాష్ అనిపించుకున్నాడు. ఇప్పటికి అర్జీవీ ఒకప్పటి సినిమాలను చూస్తే ఆ టేకింగ్ మరెవరికీ రాదు అనేంతలా ఆ సినిమాలు ఉంటాయి. ప్రస్తుతం ఆర్జీవి తీస్తున్న సినిమాలు ఎపుడు వస్తున్నాయో ఎపుడు పోతున్నాయో తెలియదు. అయితే ఒకప్పటి ఆర్జీవి సినిమాల గురించి ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సినిమాలను ఎలా ప్లాన్ చేసుకున్నారు, కథ ఎలా అనుకున్నారు లాంటి విషయాలను పంచుకున్నారు. వర్మ కెరీర్లో శివ, రంగీలా తరువాత సత్య సినిమాను చెప్పొచ్చు. అలాంటి సత్య సినిమాను తక్కువ బడ్జెట్ లో అద్భుతంగా తీసిన వర్మ ఆ సినిమా విశేషాలను పంచుకున్నారు.

కెమెరామాన్ పారిపోయాడు… ఆ తరువాత ఎలా తీసామంటే…
సత్య సినిమా కథ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గుల్షన్ కుమార్ కాల్పుల ఘటన ఇన్సిడెంట్ నుండి ఒక కిల్లర్ ఎలా ఆలోచిస్తాడు అనే నేపథ్యంలో ఆలోచించినపుడు పుట్టిన కథ. అంతకుముందు గ్యాంగ్ స్టర్స్ డాన్ కథలు హిందీలో వచ్చినా సత్య మాత్రం మాఫియా ను కొత్తగా చూపించింది. ఇక ఆ సినిమా రెండు కోట్ల బడ్జెట్ లో తీసేసారు. సినిమాలో మెయిన్ గా ఎవరూ పేరుమోసిన యాక్టర్ లేకపోవడం విశేషం. ఇక తెలుగు నుండి కేవలం జే డి చక్రవర్తి మాత్రమే ఉన్నారు. ఇక టెక్నీషియన్స్ కూడా దాదాపు అందరూ ముంబై వాళ్లనే తీసుకున్నారట వర్మ.

అయితే కెమెరామాన్ జెరార్డ్ హూపర్ ని మాత్రం తెలిసిన వ్యక్తి చెబితే అమెరికాలో నుండి పిలిపించుకున్నారట వర్మ. అయితే 15 రోజుల షూటింగ్ అయ్యాక మధ్యలో బ్రేక్ వల్ల సినిమా షూటింగ్ ఇంకా చాలా ఉండిపోయిందట. ఇక ఆ తరువాత ఆ కెమెరామాన్ కి వీసా పర్మిట్ అయిపోవడంతో సినిమా మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు అంటూ వర్మ తెలిపారు. అయితే వర్మ అతని వద్ద నాలుగో అసిస్టెంట్ గా పనిచేస్తున్న వ్యక్తిని కెమెరామాన్ గా పెట్టుకుని సినిమా తీసేశారట. సినిమా మొత్తం రియలిస్టిక్ గా ఉండాలి కానీ సినిమా లాగా ఉండకూడదనేది వర్మ అభిప్రాయం, అందుకే కెమెరామాన్ కు అదే చెప్పి సహజంగా ఉండేలా సినిమా తీసారట.






























