డబ్బెవరికి చేదు.. చెప్పండి. ఈజీగా డబ్బు వస్తుందంటే వెనుకా ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసేసుకుంటారు. ఇలాంటి వారి బలహీనతలను ఆసరాగా తీసుకుని కొంతమంది మోసాలు చేస్తూ ఈజీగానే డబ్బు సంపాదించేస్తున్నారు. మరికొంత మంది మోసగాళ్లు సోషల్ మీడియా ద్వారా ఫేస్ బుక్, వాట్సాప్ ల ఆధారంగా అమాయకులను ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలోనైతే ఈ మోసాలు మరీ ఎక్కువగానే జరుగుతుంటాయనడానికి ఉదాహరణే ఇప్పుడు మీరు చదవబోయే ఈ ఆర్టికల్.

రియల్ ఎస్టేట్ పేరుతో సంపన్నులను ఈజీగా మోసం చేసే దృశ్యాలను చాలా సినిమాల్లో చూసే వుంటారు. ఈ తరహా సీన్లలో బిల్డర్లు అక్రమ భూములను చూపించి కోట్ల సొమ్మును కాజేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. కాకపోతే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. ఈ రియల్ ఎస్టేట్ స్కామ్ లో బిగ్ సెలెబ్రీటీలైన సచిన్ టెండూల్కర్ భార్య అంజలితోపాటు సినీ తారలైన నయనతార, రమ్యకృష్ణ వంటివాళ్ళు ఇరుక్కోవడమే..! ఏంటి.. ఆశ్చర్యపోతున్నారా.?! మీరు నమ్మినా నమ్మక పోయినా ఈ రియల్ ఎస్టేట్ స్కామ్ యధార్ధంగా జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఈమధ్య ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన ఇద్దరు బిల్డర్ల మధ్య మనస్ఫర్ధలు రావడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. ఎన్నో వ్యాపారాలకు కేంద్రమైన మన భాగ్య నగరంలోనే ఈ ఘరానా మోసం జరగడం విశేషం. హైద్రాబాద్ కు సమీపంలోని రావిర్యాల ప్రాంతంలో వున్న కొన్ని భూములను సచిన్ భార్య అంజలి, సినీ తారలు నయనతార, రమ్యకృష్ణలకు విక్రయించారని తెలిసింది. వాస్తవానికి ఆ భూములు చెరువుకు సంబంధించిన భూములని, అక్కడ ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడానికి వీల్లేదనే సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఆదిత్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోని కోటా రెడ్డి, సుధీర్ రెడ్డి మధ్య గత కొన్ని రోజులుగా రియల్ ఎస్టేట్ బిజినెస్ కు సంబంధించిన వివాదం నడుస్తుంది. తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా వీళ్ళిద్దరి వివాదం వలన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోటా రెడ్డి చేసిన మోసాలను సుధీర్ రెడ్డి బహిరంగంగా తెలియజేస్తూ.. కోటా రెడ్డిపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.

అంతేకాకుండా భారత రత్న సచిన్ టెండూల్కర్ ను మోసం చేసినందుకు కోటా రెడ్డిపై భారత రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి కూడా సుధీర్ రెడ్డి లేఖ రాశాడు. అవి చెరువులకు సంబంధించిన భూములే అయినా వాటిని అత్యధిక రేటుకు అమ్మారని, సచిన్‌కు 6 ఎకరాలు, రమ్యకృష్ణ, నయన తారలకు చెరో ఎకరం అమ్మారని సుధీర్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ ద్వారా తెలిసింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఇంతవరకూ సచిన్‌కు ఆ భూముల సంగతే తెలియదట. ఆ భూములను అభివృద్ది చేస్తానని చెప్పిఅమ్మారంట.

అయితే ఈ రియల్ ఎస్టేట్ స్కామ్ పై సినీ తారలైన నయనతార గానీ, రమ్యకృష్ణ గానీ ఇంతవరకు స్పందించకపోవడం గమ్మత్తైన విషయం. కోట్ల రూపాయలు చేజారి పోతున్నా పట్టించుకోకుండా ఉన్నారు. సినిమాలే లోకంగా బ్రతికే సినీతారలకు ఇలాంటి మోసాలు, వ్యాపారాల గురించి తెలుసో.. లేదో లోగుట్టు పెరుమాళ్ళకెరుక. కానీ., ఇంతకీ ఈ రియల్ ఎస్టేట్ స్కామ్ విషయమై సచిన్ భార్య అంజలి, నయనతార, రమ్యకృష్ణలు స్పందిస్తారా.. లేదన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.!



























