బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ పై నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేవిని ఎలిమినేట్ చేయడం ఏమిటని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పశ్నిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న చాలామంది కంటెస్టెంట్లతో పోలిస్తే దేవి ఆటతీరు మెరుగ్గానే ఉంది. ఏ విషయంలోనైనా ఆమె ముక్కుసూటితనంగా వ్యవహరిస్తుంది. షోలోకి ఎంట్రీ ఇచ్చిన రోజే లేడీ బిగ్ బాస్ గా ప్రకటించుకున్న దేవి ఆ విధంగానే వ్యవహరిస్తోంది.

బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లో కూడా ఆమె కరెక్ట్ గానే వ్యవహరించింది. ప్రముఖ ఛానల్ లో న్యూస్ యాంకర్ గా పని చేస్తున్న దేవి నాగవల్లి బిగ్ బాస్ రూల్స్ కు ఎక్కడా విరుద్ధంగా నడుచుకోలేదు. బిగ్ బాస్ ఇంటి సభ్యులను సారీ చెప్పమని చెప్పిన సమయంలో తప్పు చేయనప్పుడు తానెందుకు సారీ చెప్పాలని దేవి నాగవల్లి ప్రశ్నించింది. అలా ప్రశ్నించడం వల్లే బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను ఎలిమినేట్ చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

దేవి ఎలిమినేషన్ తో బిగ్ బాస్ ఓటింగ్ సరళిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు బిగ్ బాస్ హౌస్ లో రియల్ గా గేమ్ ఆడేవాళ్ల కంటే ఆర్మీలను అడ్డం పెట్టుకుని ఆడే వాళ్లే విన్ అవుతారని కామెంట్లు చేస్తున్నారు. నిజానికి మూడు రోజుల ముందు నుంచి మెహబూబ్ ఎలిమినేట్ అవుతాడని వార్తలు వినిపించాయి. అనధికార పోల్స్ లో కూడా మెహబూబ్, కుమార్ సాయి వీక్ గా ఉన్నారు.
అయితే విచిత్రం ఏమిటంటే వాళ్లెవరూ ఎలిమినేట్ కాకుండా దేవి ఎలిమినేట్ అయింది. సూర్యకిరణ్, కరాటే కళ్యాణి విషయంలో కరెక్ట్ గానే వ్యవహరించిన బిగ్ బాస్ దేవి విషయంలో ఇలా వ్యవహరించడం దారుణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరికొందరు నెటిజన్లైతే లవ్ ట్రాక్ లు నడిపితే మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో ఉండనిస్తారా..? అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం.



























