ముకేష్ అంబానీ.. అనిల్ అంబానీ.. ఈ అంబానీ బ్రదర్స్ గురించి తెలియని భారతీయులుండరు. తండ్రి ధీరూభాయ్ అంబానీ హఠాత్తుగా మరణించేసరికి వీళ్ళిద్ద‌రికీ ఆస్తుల పంప‌కాలలో విభేధాలొచ్చాయి. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ గొడ‌వ‌లు స‌ద్దుమ‌ణి అన్నదమ్ములిద్ద‌రూ తండ్రి ఆస్తుల‌ను పంచుకున్నారు. ఆ త‌రువాత అనిల్ అంబానీ బిలియ‌నీర్ అయ్యాడు. రెండవ స్థానంలో ముకేష్ నిలిచాడు. కానీ ప్ర‌స్తుతం సీన్ రివ‌ర్స్ అయింది. ఓడ‌లు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడ‌లు అవుతాయి.. అనే సామెతకు ప్రతిరూపంగా అనిల్ అంబానీ బిలియ‌నీర్ స్ధానాన్ని కోల్పోయాడు. ముకేష్ అంబానీ ప్ర‌పంచంలోనే టాప్ బిలియనీర్ల జాబితాలో స్ధానం ద‌క్కించుకున్నాడు. వీళ్ళిద్దరి బిజినెస్ స్టోరీలోని ట్విస్ట్ ఏమిటంటే..

తండ్రి మరణాంతరం ఇద్ద‌రికీ ఆస్తి స‌మానంగా వ‌చ్చింది. కానీ దాన్ని కాపాడుకోవ‌డంలో ముకేష్ అంబానీ స‌క్సెస్ అయితే.. అనిల్ అంబానీ ఫెయిల‌య్యీడు. ఇలా ఎందుకు జరిగింది.? ముకేష్ అంబానీ స‌క్సెస్‌ సీక్రెట్స్ ఏమిటి.? అనిల్ అంబానీ ఫెయిల్యూర్‌కు గ‌ల కార‌ణాలేమిటి.? ఈ అంశాలను మనం ఒక్క‌సారి ప‌రిశీలిస్తే ధీరూభాయ్ అంబానీ బ్రతికుండగా రిల‌య‌న్స్ కంపెనీలు అన్నీ క‌ల‌సి మెల‌సి ఉండేవి. ఆ స‌మ‌యంలో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ నుంచి గ్యాస్ చాలా త‌క్కువ ధ‌ర‌కే రిల‌యన్స్ ప‌వ‌ర్‌కు స‌ప్లై అయ్యేది. కానీ అన్న‌ద‌మ్ములిద్ద‌రూ విడిపోయాక రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ ముకేష్ చేతికి, రిల‌య‌న్స్ ప‌వ‌ర్ అనిల్ చేతికి వెళ్లిపోయాయి. ఆ కారణంగా రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ త‌క్కువ ధ‌ర‌కు గ్యాస్ అమ్మ‌లేమ‌ని, మార్కెట్ ధ‌ర ప్ర‌కారం గ్యాస్ ఇస్తామ‌ని, కావాలంటే తీసుకోండి, లేక‌పోతే లేదు.. అంటూ రిల‌య‌న్స్ ప‌వ‌ర్‌కు ఖరాఖండిగా చెప్పేసింది. దాంతో అనిల్ అంబానీ ఆధ్వ‌ర్యంలో న‌డిచే రిల‌య‌న్స్ ప‌వ‌ర్ ఎక్కువ మొత్తానికి గ్యాస్‌ను కొనుగోలు చేసి ప‌వ‌ర్ ప్లాంట్‌కు వాడాల్సి వ‌చ్చింది. అది అప్ప‌ట్లోనే అనిల్ అంబానీకి కోలుకోలేని దెబ్బ‌. దాంతో ఆ కంపెనీ చాలా వ‌ర‌కు న‌ష్ట‌పోయింది. ఆ త‌రువాత ఆ న‌ష్టాలు అలాగే కొన‌సాగుతూ వచ్చాయి. ఇది ముకేష్ అంబానీకి మొద‌టి స‌క్సెస్ కాగా.. అనిల్‌కు మొద‌టి లాస్‌గా నిలిచింది.

ఇక రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌లో వ‌చ్చే లాభాల‌ను ముకేష్ అంబానీ చాలా తెలివిగా ఖ‌ర్చు పెట్టేవారు. దేశంలో చిల్ల‌ర వ్యాపారానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయ‌న రిల‌య‌న్స్ ఫ్రెష్‌, రిల‌య‌న్స్ డిజిట‌ల్‌, ట్రెండ్స్‌, ట్రెండ్స్ ఫుట్‌వేర్ పేరిట అనేక స్టోర్స్‌ను ఓపెన్ చేశారు. అవి మారుతున్న కాలానికి తగినవిధంగానే స‌క్సెస్ అయ్యాయి. కానీ అనిల్ అంబానీ మాత్రం రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అంటూ సినిమాల్లో డ‌బ్బును పెట్టుబ‌డి పెట్టారు. సినిమా ప్ర‌పంచం గురించి మ‌న‌కు తెలిసిందే క‌దా..! అందులో లాభం క‌న్నా నష్టమే ఎక్కువ‌గా వస్తుంటుంది. ఆ 2వ కారణంతో అనిల్ అంబానీ తను ఊహించని విధంగా న‌ష్ట‌పోయాడు. ఇది ఆయ‌న‌కు త‌గిలిన రెండో దెబ్బ‌. రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్స్‌ కు అప్ప‌ట్లో ఎంతో క్రేజ్ ఉండేది. అయితే భ‌విష్య‌త్తులో మొబైల్స్ వాడ‌కం, ఇంట‌ర్నెట్ వినియోగం పెరుగుతుంద‌ని అప్ప‌ట్లోనే ఊహించిన ముకేష్ చాలా జాగ్ర‌త్త‌గా ప్లాన్ వేసి, ప‌క‌డ్బందీగా కొన్ని సంవ‌త్స‌రాల పాటు శ్ర‌మించి జియో నెట్‌వ‌ర్క్‌ను నిర్మించారు.

ఆ త‌రువాత అది ఎలా లాభాల బాటలో పరుగులెట్టిందో అంద‌రికీ తెలుసు. ఆయ‌న ముందు చూపు కార‌ణంగా జియో ఇప్పుడు మ‌హా సామ్రాజ్యంగా అవ‌త‌రించింది. భ‌విష్య‌త్తులో టెక్నాల‌జీ ఏవిధంగా మారుతుందో ముకేష్ ముందే ఊహించి జియోలో పెట్టుబడి పెట్టి స‌క్సెస్ సాధించారు. కానీ అనిల్ మాత్రం రిల‌య‌న్స్ క‌మ్యూనికేషన్స్‌ను ప‌ట్టించుకోలేదు. దీంతో జియో రాగానే ఆ సంస్థ భారీగా న‌ష్ట‌పోయింది. అనిల్ అంబానీ ఫెయిల్యూర్‌లో రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్‌దే కీల‌క‌పాత్ర వహించిందని చెప్పవచ్చు. దాదాపుగా ఆ సంస్థ న‌ష్టాల వ‌ల్లే ఆయ‌న బిలియ‌నీర్ స్ధానాన్ని కోల్పోయారు. కానీ ముకేష్ మాత్రం జియో ద్వారా లాభాల బాట ప‌ట్టారు. అనేక విదేశీ కంపెనీలు ఇప్పుడందులో వాటాలు కొంటున్నాయి. ఇది ముకేష్ సాధించిన మ‌రో విజ‌యానికి నిదర్శనం. ముకేష్ అంబానీకి స‌హ‌జంగానే ముందు చూపు ఎక్కువ‌. అందుక‌నే ఆయ‌న త‌న కంపెనీల ద్వారా వ‌చ్చే లాభాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కంపెనీలు పెట్టేందుకు ఉప‌యోగించారు. అది కూడా చాలా తెలివిగా ప్లాన్ చేశారు. భ‌విష్య‌త్తులో ఏయే రంగాల‌కు డిమాండ్ ఉంటుందో ఆయ‌న ముందుగానే ప‌సిగ‌ట్టారు. అందుకు అనుగుణంగానే ఆయ‌న ఆయా కంపెనీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా విజ‌యం సాధించారు. కానీ అనిల్ మాత్రం విలాసాలు, నిర్ల‌క్ష్యంగా ఉండ‌డం, ముందు చూపు లేక‌పోవ‌డం, ఆస్తిని కాపాడుకునే య‌త్నాలు చేయ‌క‌పోవ‌డంతో న‌ష్టాల బాట ప‌ట్టాడు. ఇప్పుడు దివాలా తీశాడు.

ముకేష్ అంబానీ అందరు ధ‌నికుల్లా కాదు. ఆయ‌న ఎప్పుడూ సాదాసీదాగా ఉంటారు. ఆయ‌న సంతానం కూడా అంతే. కానీ అనిల్ అంబానీ మాత్రం అలా కాదు. విలాసాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండేవాడు. డ‌బ్బును నిర్ల‌క్ష్యంగా ఖ‌ర్చు పెట్టేవాడు. అదే ఇప్పుడాయ‌న కొంప ముంచింద‌ని మేధావులు చెబుతున్నారు. ముకేష్ అంబానీ చాలా తెలివిగా, ముందు చూపుతో వ్యాపారం చేసి స‌క్సెస్ అయ్యారు. కానీ అనిల్ కి అవేవీ లేక‌పోవ‌డంతో న‌ష్టాల ఊబిలో చిక్కుకున్నాడు. చివ‌ర‌కు బ్యాంకుల‌కు డ‌బ్బుల‌ను ఎగ్గొట్టిన ద‌గాకోరుగా చరిత్రపుటల్లో నిలబడ్డాడు. విదేశీ కంపెనీల‌కు రావ‌ల్సిన డ‌బ్బులు చెల్లించ‌డంలో అనిల్ అంబానీ విఫ‌ల‌మైతే.. ముకేష్ అంబానీ మాత్రం విదేశీ కంపెనీలే త‌న జియోలో పెట్టుబ‌డులకు వ‌చ్చేలా చేసుకున్నారు. ఇదీ.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న తేడా. అనిల్ అంబానీకి రుణాల‌ను ఇచ్చేందుకు కూడా ఇప్పుడు బ్యాంకులు ముందుకురావడం లేదు. దీంతో అనిల్ అంబానీ భ‌విష్యత్ ప్ర‌స్తుతం అన్న ముకేష్ చేతుల్లోనే ఉంద‌ని మార్కెట్ విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితి ఇలా ఎంత కాలం ఉంటుందో చెప్ప‌లేం. కానీ వ్యాపారానికి పెద్ద ఎత్తున అప్పులు తీసుకుని న‌ష్టాలు రావ‌డంతో అనిల్ విఫ‌ల‌మైతే.. ముకేష్ మాత్రం పెట్టుబ‌డులను ఆహ్వానిస్తూ లాభాల బాట ప‌ట్టారు. అనిల్ ఫెయిల్యూర్‌, ముకేష్ స‌క్సెస్‌ను చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌లో పెట్రోల్ సంస్థే పెద్ద కంపెనీ. అలాగే టాటా గ్రూప్ వారికి టీసీఎస్ పెద్ద కంపెనీ.. ఆయా గ్రూప్‌ల‌లో ఉన్న ఇత‌ర కంపెనీల‌కు న‌ష్టాలు వ‌స్తే ఆదుకునేందుకు ఆ పెద్ద కంపెనీలు ఉన్నాయి.

కానీ అనిల్ అంబానీకి చెందిన గ్రూప్ కంపెనీల్లో నిజానికి ఇలాంటి పెద్ద కంపెనీ ఒక్క‌టీ లేదు. దీంతో ఆయ‌న స‌హ‌జంగానే దివాలా తీయాల్సి వ‌చ్చింది. ముకేష్ అంత‌గా స‌క్సెస్ అవడానికి కార‌ణం ఆయ‌న‌కున్న రిల‌య‌న్స్ చ‌మురు బిజినెసే అని చెప్ప‌వ‌చ్చు. అందులో వ‌చ్చిన లాభాల‌నే ఆయ‌న ఇత‌ర సంస్థ‌ల‌కు పెట్టుబ‌డిగా పెట్టి సక్సెస్ సాధించారు. ముకేష్ అంబానీ దేశంలో, రాష్ట్రాల్లో అధికారాల్లో ఉండే రాజ‌కీయ పార్టీలు, నాయ‌కుల‌తో స‌త్సంబంధాలు కొన‌సాగించేవారు. ఆయ‌న వ్యాపారాలు స‌జావుగా, సుదీర్ఘ‌కాలం పాటు విజ‌య‌వంతంగా న‌డిచేందుకు ఇది కూడా ఒక కార‌ణ‌మే. కానీ అనిల్ మాత్రం ఇలాంటివేవీ ప‌ట్ట‌కుండా ఉండేవారు. దీంతో అది ఆయన ప‌త‌నానికి కార‌ణ‌మైంది.

ముకేష్ అంబానీ స‌క్సెస్ సాధించేందుకు కార‌ణ‌మైన వ్యాపారాల్లో ఐపీఎల్ ముంబై ఇండియ‌న్స్ ఫ్రాంచైజీ కూడా ఒక‌టి. ఆ టీం ఐపీఎల్‌లో ప‌లు టోర్నీలు సాధించింది. ఈ క్ర‌మంలో ఆ ఫ్రాంచైజీకి ఆదాయం కూడా బాగానే వ‌చ్చింది. అలాగే ఆ టీం పేరిట ఆయ‌న భార్య నీతా అంబానీ అనేక చారిటీ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. దీంతో ఆమె కూడా బాగానే పాపుల‌ర్ అయ్యారు. ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. కానీ అనిల్ అంబానీ ఇలాంటి విషయాలకు దూరంగా ఉన్నారు. ముకేష్ అంబానీకి చెందిన రిల‌య‌న్స్ సంస్థ‌లు, జియోపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం బాగా కుదిరింది. నాణ్య‌మైన సేవ‌ల‌ను అందిస్తుండ‌డంతో ఆ కంపెనీకి వారు ద‌గ్గ‌ర‌య్యారు. ముకేష్ స‌క్సెస్ వెనుక ఉన్న కార‌ణాల్లో ఇది కూడా ఒక‌టి. దీంతోపాటు ముకేష్ పిల్ల‌లు కూడా ఆయ‌న వ్యాపారాన్ని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించే స్థాయికి ఎదిగారు. ఏ పారిశ్రామిక వేత్తయినా కోరుకునేది అదే క‌దా.. అందుక‌నే ఆయ‌న అనిల్ క‌న్నా విజ‌య‌వంత‌మైన వ్య‌క్తిగా నిలిచారు. నమ్మకం, ముందుచూపు ఈ రెండూ విజయానికి మూలస్తంభాలనే జీవిత సత్యాన్ని మనం ముకేష్ అంబానీ సక్సెస్ స్టోరీ ద్వారా తెలుసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here