తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫాంహౌజ్ సంబంధించి అనేక నిబంధనలు ఉల్లంఘించారని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గత కొద్దిరోజులుగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ట్విట్టర్లో ఆయన చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. కేటీఆర్, తెలంగాణ సీఎంఓను ఆ ట్వీట్‌లో ట్యాగ్ చేసి.. ‘‘ముందుంది ముసళ్ల పండుగ. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు..’’ అంటూ ట్వీట్ చేసారు. దీనితో అసలు కేటీఆర్ కి సంబంధించిన రహస్యాలు ఏవో మధ్యాహ్నం 1 గంటకు చెప్పబోతున్నట్టు తెలిపారు.

మంత్రి కేటీఆర్ అక్రమంగా జన్వాడలో ఫాంహౌస్ నిర్మించారని, మూడంతస్తుల భవనం, చుట్టూ ఉద్యానవనం నిర్మిచారని ఇది పర్యావరణానికి హానికరం అని ఇదివరకే రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్జీటీ విచారణకు కూడా ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ విచారణ జరిపి నివేదికను రెండు నెలల్లో ఇవ్వలసిందిగా ఆదేశించింది.
In front crocodile festival tomorrow at 1 pm @ktrtrs @TelanganaCMO
— Revanth Reddy (@revanth_anumula) June 7, 2020
కాగా, ఈ విషయంపై కేటీఆర్ ఇదివరకే స్పందించారు “తనపై దుష్ర్పచారాలు చేస్తున్నారంటూ కొట్టిపడేసారు. అసలు ఆ ఫాంహౌస్ తనది కాదనే విషయం తాను గతంలోనే చెప్పానని తన ట్విట్టర్ లో వెల్లడించారు. ఈ విషయంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా కేటీఆర్ కు మద్దతు పలికారు. మరోవైపు రేవంత్ రెడ్డిపై టిఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. నిన్న సినీనటుడు పోసాని కూడా కేటీఆర్ కు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.






























