ఎడారిలో ఇసుకను అమ్మగలిగేంత అపర మేధావి మన రామ్ గోపాల్ వర్మ. ఆయన తెలివి తేటలకు నిదర్శనంగా ఈమధ్య ఆన్ లైన్లో విడుదలైన వర్మ చిత్రాలనే చెప్పవచ్చు. ఒకప్రక్క షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూతపడ్డ ఈ లాక్ డౌన్ సమయంలో కూడా ఆయన సినిమాలు తీస్తున్నారు. తన ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ ద్వారా ఆన్ లైన్లో సినిమాలను విడుదల చేసి సొమ్ము చేసుకుంటున్నాడు.

ఈమధ్యకాలంలో పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ అనే బూతు సినిమాకు రూ.100 టికెట్ పెట్టి కోట్లు సంపాదించిన వర్మ.. ఆ తర్వాత ‘నగ్నం’ పేరుతో లోకల్ బీ గ్రేడ్ బూతు బొమ్మకు రూ.200 టికెట్ పెట్టి దాని ద్వారా కూడా బాగానే సంపాదించాడు. ప్రేక్షకుల బలహీనతను క్యాష్ చేసుకోవడం బాగా అలవాటు చేసుకున్న రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఏకంగా ట్రైలర్‌కీ టికెట్టు పెట్టి పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడు. వివరాల్లోకి వెళ్ళే.. తాజాగా ఆన్ లైన్ లో రామ్ గోపాల్ వర్మ విడుదల చేయబోతున్న కొత్త సినిమా ‘పవర్ స్టార్’. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి తీసిన సినిమాగా ఈ చిత్రం కోసం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పవర్ స్టార్ పవన్ కెరీర్లో మైలురాయిలా నిలిచిన ‘తొలి ప్రేమ’ చిత్రం విడుదలైన రోజే అంటే జులై 24నే ఈ చిత్రం కూడా రిలీజవుతుందని వర్మ చెప్పిన సంగతి తెలిసిందే.

పవర్ స్టార్ సినిమా ఎలా వున్నా, అందులో ఏమున్నా, పవన్ ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ చూస్తారని వర్మ ఆశ. పైగా ఇది పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి తీసిన సినిమా కాబట్టి క్రేజ్ కాస్త ఎక్కువగానే వుంటుందని వర్మ అంచనా. సో.. ఆ క్రేజ్ ని ట్రైలర్ నుంచే క్యాష్ చేసుకోవాలని ఆరాటపడుతున్నాడు. కనుక అందరిలాగ ‘పవర్ స్టార్’ ట్రైలర్ ను యూ ట్యూబ్ లో ఫ్రీగా చూపించదల్చుకోలేదు వర్మ. ఆ ట్రైలర్ ను చూడటానికి కూడా రేటు పెడుతున్నాడు. సుమారు రూ.50 దాకా టికెట్ పెడితే తప్ప ఆ ట్రైలర్ చూడలేరట. ప్రపంచంలో ఇలా ట్రైలర్‌ను కూడా అమ్మకానికి పెట్టిన తొలి ఫిలిం మేకర్ మన సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మే కావచ్చు. సినిమా చూడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి అందరూ ట్రైలర్ చూస్తారు. కానీ దానికి కూడా రేటు పెట్టాలన్న వర్మ ఆలోచన నిజంగా అద్భుతం. ట్రైలర్ చూస్తే గానీ, సినిమాపై ఓ అంచనాకు రాలేం. జనమంతా ట్రైలర్ చూసి, సినిమా చూడరేమో అన్నది వర్మ డౌటు. అందుకే రేటు పెట్టాడు. వర్మ నుంచి ఏ చిన్న వీడియో వచ్చినా జనం ఆసక్తిగా గమనిస్తుంటారు. దాన్నే ఇప్పుడు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు. వర్మా… కరోనా టైంలో ఏంటీ ఖర్మా.?!



























