ముంబైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో గది తీసుకున్న ఓ అతిథికి ఎదురైన అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. తాను ఆర్డర్ చేసిన సాధారణ ఆహారానికి వచ్చిన భారీ బిల్లు చూసి ఆశ్చర్యపోయిన అతను వీడియో రూపంలో స్పందించడంతో విషయం కాస్తా వైరల్‌గా మారింది. దీంతో ఫైవ్‌స్టార్ హోటళ్ల ధరల విధానంపై మరోసారి చర్చ మొదలైంది.

ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ముంబైలోని హిల్టన్ హోటల్‌లో బస చేసిన సమయంలో రూమ్ సర్వీస్ ద్వారా రాత్రి భోజనం ఆర్డర్ చేశాడు. అందులో ఆలూ పరాఠా, ఉడికించిన గుడ్లు, పెరుగు, వనిల్లా మిల్క్‌షేక్ వంటి సాధారణ ఐటమ్స్ ఉన్నాయి. అయితే వీటికి మొత్తం బిల్లు రూ. 2,300 రావడంతో అతను షాక్‌కు గురయ్యాడు.
ప్రత్యేకంగా మూడు ఉడికించిన గుడ్లకు దాదాపు రూ. 499 (పన్నులతో కలిపి) వసూలు చేయడాన్ని అతను ప్రశ్నించాడు. బయట మార్కెట్‌లో తక్కువ ధరకు లభించే గుడ్లకు ఈ స్థాయిలో ఛార్జ్ చేయడం సరైంది కాదని వీడియోలో పేర్కొన్నాడు. ఒక్కో గుడ్డు ధర సుమారు రూ. 160 నుంచి రూ. 170 వరకు పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఫైవ్‌స్టార్ హోటళ్లలో సౌకర్యాలు, సర్వీస్ కారణంగా ధరలు ఎక్కువగా ఉంటాయని తనకు తెలుసని, కానీ ఈ స్థాయిలో ధరలు ఉండటం అర్థం కావడం లేదని అతను అభిప్రాయపడ్డాడు. సాధారణంగా నాలుగు లేదా ఐదు రెట్లు ధరలు పెంచడం సహజమే అయినా, ఇంత భారీగా ఛార్జ్ చేయడం తగదని వ్యాఖ్యానించాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. లక్షల వ్యూస్ రావడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. కొందరు అతిథి అభిప్రాయానికి మద్దతు తెలుపుతూ ధరలు అధికంగా ఉన్నాయని వ్యాఖ్యానించగా, మరికొందరు హోటల్ విధానాన్ని సమర్థించారు.
రూమ్ సర్వీస్‌లో అదనపు ఛార్జీలు సహజమేనని, ఫైవ్‌స్టార్ హోటళ్లలో లగ్జరీ సేవలకు అనుగుణంగానే ధరలు ఉంటాయని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. మరోవైపు, ప్రీమియం హోటళ్ల ధరల నిర్మాణంపై పారదర్శకత అవసరమని మరికొందరు అభిప్రాయపడ్డారు.
ఈ ఘటనతో ముంబై సహా దేశవ్యాప్తంగా ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఆహార ధరలపై మళ్లీ చర్చ ప్రారంభమైంది. సాధారణ వినియోగదారులకు అందని స్థాయిలో ధరలు ఉన్నాయా లేక సౌకర్యాల ఖర్చే కారణమా అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.



























