మనసు మమత, మౌనరాగం ఫేమ్ శ్రావణి ఆత్మహత్య కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తీగ లాగితే డొంకంతా కదులుతోంది. పోలీసులు ఈ కేసులో దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణారెడ్డి, అశోక్ రెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారణ జరపగా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో నిర్మాత అశోక్ రెడ్డి శ్రావణిని వేధించినట్టు తేలింది. తీవ్రస్థాయిలో వేధింపులకు పాల్పడటంతో శ్రావణి ఒత్తిడికి లోనైందని సమాచారం.

అశోక్ రెడ్డి నిర్మించిన ఆర్‌ఎక్స్ 100 సినిమాలో కూడా శ్రావణి చిన్నపాత్రలో కనిపించింది. పేద కుటుంబానికి చెందిన శ్రావణికి డబ్బు ఎరగా చూపి అశోక్ రెడ్డి లొంగదీసుకున్నాడని సమాచారం. అశోక్ రెడ్డి శ్రావణిని అన్ని విధాలుగా వాడుకున్నట్లు తెలుస్తోంది. శ్రావణి దేవరాజ్ తో సన్నిహితంగా మెలగడంపై కూడా అశోక్ రెడ్డి పలుమార్లు సీరియస్ ఆయ్యాడని సమాచారం. గడిచిన నాలుగేళ్ల నుంచి శ్రావణితో అశోక్ రెడ్డికి పరిచయం ఉంది.

శ్రావణికి ఏ అవసరం వచ్చినా డబ్బు సాయం చేయడానికి అశోక్ రెడ్డి వెనుకాడేవాడు కాదు. అదే సమయంలో శ్రావణి తనకు నచ్చని పని చేస్తే మాత్రం వేధింపులకు, చిత్రహింసలకు గురి చేసే వాడు అశోక్ రెడ్డి. పోలీసుల విచారణలో అశోక్ రెడ్డి తనను కాదని మరెవరిని శ్రావణి వివాహం చేసుకోకూడదని జులుం ప్రదర్శించినట్టు తేలింది. శ్రావణితో పాటు శ్రావణి తల్లిదండ్రులను కూడా అశోక్ రెడ్డి బెదిరించాడని సమాచారం.

సాయి, అశోక్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారని శ్రావణి పలు సందర్భాల్లో దేవరాజ్ తో చెప్పుకుంది. అయితే తనను ప్రేమించానని చెప్పిన దేవరాజ్ పెళ్లి చేసుకోనని చెప్పడంతో శ్రావణి భరించలేకపోయింది. దేవరాజ్ సాయి, అశోక్ రెడ్డిలకు దూరంగా ఉంటేనే పెళ్లి చేసుకుంటానని శ్రావణికి చెప్పగా తాను దూరంగా ఉన్నా వాళ్ల నుంచి వేధింపులు తప్పవని శ్రావణి భావించింది. ఒకేసారి ముగ్గురి నుంచి వేర్వేరు విధాలుగా వేధింపులు ఎదురు కావడంతో శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.



























