హీరోయిన్ సమీరా రెడ్డి ఈమధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో కనబడుతుంది.
రాజమండ్రిలో పుట్టి ముంబైలో పెరిగిన సమీరాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. తాజాగా ఆమె మన టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసిందని తెలిసింది. ప్రముఖ తమిళ దర్శకుడు Ks రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో సమీరారెడ్డి హీరోయిన్‌గా నటించబోతుందని టాలీవుడ్ టాక్.

సమీరా రెడ్డి గతంలో ఎన్టీఆర్ సరసన అశోక్, నరసింహుడు చిత్రాల్లో నటించింది. పెళ్లైన తర్వాత సమీరా రెడ్డి సినిమాల్లో నటించడం తగ్గించింది. ప్రస్తుతం సమీరా భార్యగా, తల్లిగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే.. బాడీ షేమింగ్ చేసేవాళ్లను ఉద్దేశించి ‘షేమ్ షేమ్’ అంటుంది సమీరా రెడ్డి. ‘‘మనమెలా ఉంటే అలా స్వీకరించడాన్ని నేర్చుకుందాం. మనల్ని మనం ఇష్టపడదాం. ఇతరులతో పోల్చుకోవడం మానేద్దాం. పోల్చిచూడటం ఆపేద్దాం’’ అంటూ బాడీ షేమింగ్ గురించి ఓ వీడియోను తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది సమీరా. ఈమధ్య కాలంలోనే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఒకమ్మాయి పంపిన మెసేజ్ ఆధారంగానే బాడీ షేమింగ్ టాపిక్ పై వీడియో చేసినట్టు తెలిపారు సమీరా.

ఇంతకీ సమీరా షేర్ చేసిన వీడియో సారాంశం ఏమిటంటే.. ‘‘సమీరా..! ఈ మధ్యనే తల్లైన నేను బరువు పెరిగాను. నా శరీరం నాకే నచ్చడం లేదు. అసహ్యంగా ఉన్నాననిపిస్తోంది’ అనే మెసేజ్ నాకు వచ్చింది. ఆ మెసేజ్ ని చదువుతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ముందు మన దగ్గర ఏం లేదో దాని గురించే పదే పదే ఆలోచించి బాధ పడటం మానేద్దాం. అది జీరో సైజ్ అయినా కావొచ్చు.. ఇంకేదైనా కావొచ్చు.. మన దగ్గర ఉన్నదానితో సంతోష పడటం నేర్చుకుందాం. చిన్నప్పడు నన్ను మా అక్కయ్యను ఎప్పుడూ ఎవరో ఒకరితో పోలుస్తూనే ఉండేవారు. తను అలా ఉంది.. నువ్వు ఇలా ఉన్నావు అని. ఇక నేను పని చేసిన సినిమా రంగం కూడా చేస్తున్న పని అదే.. పోల్చి చూడటం. దాంతో నేను నా చుట్టూ వున్న నలుగురూ చూడటానికి నేను బాగుండాలని చేయని ప్రయత్నం లేదు. మేకప్, లెన్స్, ప్యాడ్స్.. ఇలా అన్నీ వాడాను. ఇలాంటివి చేసినా సంతోషంగా ఉన్నానా.? అంటే అస్సల్లేను. మనమెలా ఉన్నామనేది ముఖ్యం కాదు. సంతోషంగా ఉన్నామా.? లేదా.? అన్నదే ముఖ్యం.
చాలా సంవత్సరాల నుండి ఇలాంటి బాడీ షేమింగ్స్‌తో విసుగుపోయాను. పట్టించుకోవడం మానేశాను. మనం సంతోషంగా ఉన్నామా.? లేదా.? అనే విషయం మీదే దృష్టి పెట్టాను. మీరు కూడా అదే పాటించండి. లావుగా ఉన్నారా.? అయినా ఫర్వాలేదు.. మెల్లగా తగ్గుతారు. కంగారు పడకండి.. కృంగిపోకండి. అనవసరమైన విమర్శలతో వేరే వాళ్లు కృంగిపోయేలా చేయకండి. సంతోషంగా ఉండటం పైనే దృష్టి పెట్టండి. అసంపూర్ణాన్ని కూడా ఆస్వాదిద్దాం. అసంపూర్ణం కూడా సంపూర్ణం అనుకుందాం. అప్పుడు లైఫ్ చాలా బాగుంటుంది!’’ అని ఆ వీడియోలో సమీరా రెడ్డి చెప్పిన మాటలు చాలా అర్థవంతంగా, నలుగురికి స్ఫూర్తినిచ్చేలా ఉన్నాయి. సమీరా రెడ్డి ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. ఆమె తల్లైనప్పటి నుంచి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇలాంటి విషయాలను గురించే చర్చిస్తూ, తన ఫాలోవర్స్ లో ఒక అవగాహనను తీసుకొస్తూ, అభద్రతా భావంతో బాధ పడేవాళ్లకు ధైర్యం నింపే దిశగా అడుగులేస్తుంది సమీరా. రియల్లీ హాట్సాఫ్ టూ సమీరా.!



























