దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. కరోనా, లాక్ డౌన్ వల్ల వినియోగదారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. లోన్ రిస్ట్రక్చరింగ్‌లో భాగంగా 24 నెలల పాటు ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొనడం గమనార్హం.

క్రెడిట్ కార్డు ఔట్‌స్టాండింగ్ మొత్తాన్ని ఎవరైతే రిస్ట్రక్చరింగ్ చేసుకొని లోన్‌గా మార్చుకుంటారో వాళ్లు రెండేళ్ల పాటు బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు. రెండు సంవత్సరాల అనంతరం లోన్ పై ఈఎంఐ ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే అందరికీ ఈ ఆఫర్ వర్తించదు. ఎస్బీఐ మార్చి 1 నుంచి అకౌంట్లు ఎన్‌పీఏలుగా మారని వారికి.. మార్చి 1కి నెలరోజుల ముందు డిఫాల్ట్ కాని వారికి ఈ ప్రయోజనాలు కలుగుతాయి.
గడిచిన ఆరు నెలల్లో మారటోరియం ప్రయోజనాలను పొంది ఉండటంతో పాటు మినిమం బ్యాలన్స్ చెల్లించని వాళ్లు ఈ ప్రయోజనాలను పొందవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ మారటోరియంకు అర్హులైన వారి జాబితాను సిద్ధం చేస్తోంది. అయితే మారటోరియం ప్రయోజనం పొందిన వారు వడ్డీ మాత్రం తప్పక చెల్లించాల్సి ఉంటుంది.
చెల్లించాల్సిన మొత్తాన్ని లోన్ రూపంలోకి మార్చుకున్న వినియోగదారులు 13 నుంచి 19 శాతం మధ్యలో వడ్డీని చెల్లించి మారటోరియం ప్రయోజనాలను పొందవచ్చు. 2020 డిసెంబర్ 31 వరకు క్రెడిట్ కార్డ్ ఉన్నవాళ్లు లోన్ మారటోరియం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే లోన్ మారటోరియం ఫెసిలిటీ పొందిన క్రెడిట్ కార్డ్ డీయాక్టివేట్ అవుతుంది. మూడు నెలల నుంచి ఆరు నెలల ఈఎంఐలు చెల్లిస్తే మాత్రమే కార్డు యాక్టివేట్ అవుతుంది.



























