Senior Actress Jamuna : 1960 ప్రారంభ దశకంలో రచయితగా నిర్మాతగా పనిచేసిన దుక్కిపాటి మధుసూదన్ రావు అనుకోకుండా ఒక సినిమాకి దర్శకత్వం వహించాల్సివచ్చింది. కృష్ణమూర్తి నిర్మాణ సారధ్యంలో మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన “పదండి ముందుకు” చిత్రం 1962లో విడుదల అయింది. ఈ చిత్రంలో జమున, జగ్గయ్య హీరో, హీరోయిన్లుగా నటించారు.

సినిమా షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సినిమా టెక్నికల్ వర్క్ కోసం దర్శకుడు డి.మధుసూదన్ రావు, గుమ్మడి, జమున కలిసి రష్యా వెళ్లారు. అక్కడ స్టూడియోస్ లో చిల్డ్రన్ స్టోరీతో కూడిన ఒక సినిమా చూశారు. ఆ సినిమాను డి. మధుసూదన్ రావు భార్యకు చూపించగా మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఆమె ఒక కథ రాశారు. అలా కథా రచయిత సరోజినీ, జమున వీళ్లంతా కలిసి ఒక సినిమా నిర్మిద్దాం అనుకున్నారు. అప్పటికి నటి సావిత్రి కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. వీరంతా బలవంతం చేయడంతో సావిత్రి వెళ్లి తన భర్త జెమినీ గణేషన్ తో విషయం చెప్పారు. ఆయన కొంత సమయం తీసుకుని ఆలోచించి దర్శకత్వం చేయమని చెప్పారు. అలా ఆమె దర్శకత్వం చేయడానికి ముందుకు వచ్చారు.

‘చిన్నారి పాపలు’ అనేది 1968లో వచ్చిన సినిమా. వీరమాచనేని సరోజిని రచించి, నిర్మించగా సావిత్రి దర్శకత్వం వహించింది. ఈ చిత్రంలో జమున, జగ్గయ్య, షావుకారు జానకి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఒక ధనవంతుడు గిరిజన అమ్మాయితో ప్రేమలో పడే కథ. వారు విడిపోయినప్పుడు ఈ జంట జీవితంలో సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందో చెబుతుంది.

“చిన్నారి పాపలు” సావిత్రికి దర్శకురాలిగా తొలి చిత్రం. దీని సిబ్బందిలో ఎక్కువగా మహిళలే. దర్శకత్వం సావిత్రి, నిర్మాణం-రచన సరోజిని, సంగీత దర్శకత్వం పి.లీల, ఆర్ట్ డైరెక్టర్ మోహన, నృత్యాలు రాజసులోచన. ఇలా అత్యధికంగా మహిళలచే రూపొందించబడిన ఈ చిత్రం ఆగస్టు 14,1968లో బాక్సాఫీస్ ముందుకు వచ్చింది. అయితే మధుసూదన్ రావు భార్య సరోజినీ, నేను, షావుకారు జానకి మేమంతా తల 5000 రూపాయలు వేసుకొని సినిమా నిర్మించాలనుకున్నాం. సావిత్రి నాతో మాట్లాడుతూ.. చెల్లి ఈ సినిమాలో నువ్వు హీరోయిన్ గా నటించాలని కోరారు. ఆమె అడగడంతో నేను ఈ సినిమాలో హీరోయిన్ గా నటించాను. అంతా మహిళలచే రూపొందించబడిన ఆ మొదటి ప్రయోగం తీవ్రపరాజయాన్ని పొందింది. కనీసం ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ కూడా తిరిగి రాబట్ట లేకపోయింది. కానీ దర్శకురాలిగా సావిత్రికి మంచి పేరు వచ్చిందనడంలో సందేహం లేదని ఆ ఇంటర్వ్యూలో జమున చెప్పుకొచ్చారు.



























