Senior NTR : నందమూరి తారక రామారావు సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. నటనలో ఒక శిఖరం లాంటి ఆయన రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. తెలుగు దేశం పార్టీ స్థాపించి తెలుగు ప్రజలలో రాజకీయ చైతన్యం తెచ్చారు ఎన్టీఆర్. ఆయన పార్టీ స్థాపించి సమాజ సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తరువాతే సమాజ సేవ చేసారని అందరూ అనుకుంటారు కానీ ఆయన సినిమాల్లో నటించిన సమయంలోనూ ఇండస్ట్రీలో ఎంతో మందికి సహాయం చేసారు.

ఆయన మృతి కలచివేసి బ్లడ్ బ్యాంకు…
సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే అన్నగారు ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఆయన సమస్యగా భావించి పరిష్కరిస్తారు. ఒక అగ్రదర్శకుడి సోదరుడు యాక్సిడెంట్ అయి హాస్పిటల్ లో అతని గ్రూప్ రక్తం దొరకక చనిపోవడం అన్నగారిని కలచివేసింది. దీంతో అన్నగారు ఇలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదనే ఉద్దేశంతో విజయ సంస్థ వారి సహకారంతో హీరోయిన్ సావిత్రి గారి తోడ్పాటుతో విజయ సంస్థ స్థలంలో ఒకచోట రక్త నిధి ని ఏర్పాటు చేసారు. అది నేటికీ కొనసాగుతోంది. ఇక దివిసీమ తుఫాను సమయంలో కూడా ఆయన సేవలు మరచిపోలేము.

అప్పుడు కూడా ఆయనకు సావిత్రి గారు ఏఎన్ఆర్ గారు తొడ్పాటు అందించారు. తమిళనాడు లోని తీరప్రాంతాలు మునిగిన సమయంలో కూడా అందరినీ కలుపుకుని ఆయన సహాయం చేసారు. ఇక హాస్య నటుడు రేలంగి సలహా మేరకు మద్రాస్ సినీ వర్కర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. సినీ రంగంలో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించేందుకు ఒక నిధిని ఏర్పాటు చేశారు. దీని బాధ్యతలను తమిళనాడు క్యారెక్టర్ ఆర్టిస్టు అన్నామలైకి అప్పగించారు. అయితే కొన్నేళ్లకు ఆర్థికపరమైన తేడాలు రావడంతో దీనిని రద్దు చేసుకున్నారు.
































