Senior NTR : తెలుగు జాతి మరువని పేరు, అన్నా అని ఆప్యాయంగా ప్రతి తెలుగువాడు పిలుచుకునే వ్యక్తి నట సార్వభౌమ నందమూరి తారక రామరావు. సినిమాలతో తెలుగుజాతిని తరింపజేసిన తారకరాముడు ఆ తరువాత రాజకీయాల్లో కూడా సంచలనాలు సృష్టించాడు. జానపదమైనా, సాంఘికమైనా, పౌరాణికమైనా ఆయనకు అందె వేసిన చేయి. ఇక దేవుడు కూడా ఇంత అందంగా ఉంటాడో లేదో తెలియదు కానీ కృష్ణుడు అన్నా, రాముడు అన్నా మనకు తెలిసిన రూపం ఎన్టీఆర్. ఇక దుర్యోధనుడు, రావణుడైనా ఎన్టీవోడే గుర్తొస్తాడు. ఇక కాంగ్రెస్ పాలనకు విముక్తి కలిగించి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పెంచిన మహనీయుడు తారక రాముడే.


తారక రాముడు భోజన ప్రియుడు……
ఇక ఎన్టీఆర్ భోజన ప్రియుడని అందరికి తెలుసు. క్రమశిక్షణలో ముందుండే ఎన్టీఆర్ ఆహారం విషయంలోనూ శ్రద్దగా ఉండేవారట. ఉదయం నాలుగింటికే దినచర్య ప్రారంభించే ఎన్టీఆర్, షూటింగ్ 6 గంటలకైతే సెట్స్ లో 5:45 కల్లా ఉండేవారట. ఇక ఉదయం పూట ఫలహారం కోసం ఇడ్లీ, నాటుకోడికూర చాలా ఇష్టపడేవారట. అరచేయి మందం ఉండే ఇడ్లీలను 20 వరకు లాగించే వారట. అయితే ఒకేసారి 20ఇడ్లీలను తినకుండా ఒక 15 వరకు ఒకసారి తిని మళ్ళీ షూటింగ్ బ్రేక్ లో మరో ఐదారు లాగించేవారట. ఎన్టీఆర్ మాంసాహార ప్రియుడు. నాటు కోడిని ఇష్టంగా తినేవారట. మంచి అన్నం, కోడికూర, పెరుగు, రెండు మూడు రకాల కూరలు, పెరుగు, నెయ్యి ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెపుతారు. వెజ్ లో అయినా చారు, అప్పడం ఆయన మెనూలో ఖచ్చితంగా ఉండాల్సిందే.

ఎక్కడున్నా ఆపిల్ జ్యూస్…..
ఇక ఎన్టీఆర్ కు ఆపిల్ జ్యూస్ అంటే చాలా ఇష్టమట. ప్రతిరోజు 3 నుండి 5 బాటిల్ల ఆపిల్ జ్యూస్ తాగేవారట. చెన్నైలో ఉంటే ఎక్కడ ఆపిల్స్ బాగా దొరుకుతాయో కనుక్కుని అక్కడి నుంచి తెప్పించుకునేవారట. రోజుకు ఒక్కోసారి మూడు షిఫ్ట్లు పనిచేసినా బ్రేక్ సమయంలో తిండి గురించి మాట్లాడేవారట. సాయంకాలం బజ్జిలు తినడం చాలా ఇష్టపడుతారట. డ్రై ఫ్రూట్స్ కూడా ఖచ్చితంగా రోజు తింటారట పెద్దాయన. ఇక తనతో పనిచేసే హీరోయిన్లకు మిగతా సిబ్బందికి కూడా డ్రై ఫ్రూట్స్ తినమని దానివల్ల అలసట రాదని సూచించేవారట.
జన చైతన్య యాత్రలో సామాన్యుడిలా….

ఇక వేసవిలో రెండు లీటర్ల బాదాం పలు తాగేవారట. భోజనం తరువాత జ్యూస్ లో గ్లూకోజ్ వేసుకుని తాగడం అలవాటు. ఇక తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత ప్రజాక్షేత్రంలోకి జన చైతన్య యాత్ర పేరుతో వెళ్లారు. ఆ సమయంలో ఎక్కడపడితే అక్కడ తినాల్సి వచ్చేది. అయినా వెళ్లిన ప్రాంతంలో ఏం దొరుకుతాయో ఆ పదార్థాలనే తింటూ సామాన్యుడిలా ఉండడం విశేషం. ఏమాత్రం సౌకర్యాలు లేకపోయినా ప్రజల్లో మమేకమై చైతన్య యాత్రలో పాల్గొన్నారు. అందుకే ఆయన మహానాయకుడు అయ్యారు. ఇప్పటికి తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయారు.



































