నందమూరి తారక రామారావు… ఈయన గురించి ఏ చిత్ర సినిమా రంగంలో అయినా సరే ప్రత్యేకంగా మళ్లీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. దీనికి కారణం ఆయన నటన, నిబద్ధత, సమయపాలన ఇలా చెప్పుకుంటూ వెళితే అనేకం. సినిమా తీసే సమయంలో నందమూరి తారకరామారావు ఎంత నియమ నిబద్ధత లో ఉంటారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమయం అంటే సమయం, నటన అంటే నటన ఇలా ఏది చెబితే అది మాత్రమే కచ్చితత్వంతో చేసే మనిషి నందమూరి తారక రామారావు గారు.

అయితే ఒకసారి ఆయన బెంగళూరు నగరంలో మరుసటిరోజు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. అయితే అప్పటికి ఆయన చెన్నై లో ఉండేవారు. అయితే బెంగళూరులో దిగి షూటింగ్ స్పాట్ కు వెళ్లి కృష్ణుడు వేషం వేయించుకోవాలి అంటే సగం రోజు గడిచిపోతుందని అనే ఉద్దేశంతో ముందురోజే తన ఇంటికి మేకప్ ఆర్టిస్టులను పిలిపించుకొని పూర్తిగా కృష్ణుని వేషం వేసుకొని చివరకు కిరీటం కూడా పెట్టుకొని అలాగే కిరీటం పైన ఒక చిన్న శాలువా కప్పుకొని చెన్నై విమానాశ్రయానికి చేరుకుని బెంగళూరుకు వచ్చేశారు. అలా దిగి ఆయన డైరెక్టుగా సినిమా స్పాట్ కు వెళ్లగా అక్కడ ఉన్న చిత్ర యూనిట్ సభ్యులు అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఆయన మేకప్ ను చూసి నిజంగా ఆశ్చర్యపోయి వారి నోట వెంట మాటలు రాలేదంటే నమ్మండి. దీన్ని బట్టి చెప్పొచ్చు నందమూరి తారక రామారావు గారికి ఆయనకు సినిమాల పట్ల ఉన్న నియమ నిబద్ధత. ఆయన ఒక్కరే సమయపాలన పాటిస్తారు అంటే కనుక తప్పే… ఆయనతో పాటు ఆయన పక్కన ఉన్న సినీ తారలు కూడా సమయపాలన పాటించాల్సిందే. ఈ విషయంలో ఒక సారి అల్లు రామలింగయ్య గారికి, నటి జమున గారికి అక్షింతలు కూడా పడ్డాయి.

అయితే ఒకసారి సీనియర్ ఎన్టీఆర్ గారికి ఈ విషయంలో చాలా కోపం వచ్చింది. అది కూడా నటి కె.ఆర్. విజయ మీద వచ్చింది. మొదటగా ఆమె కృష్ణ పాండవీయం సినిమా లో నటించడానికి ఎంపికయ్యారు. అది ఎన్టీఆర్ గారి సొంత బ్యానర్. ఇకపోతే విజయ షూటింగ్ కి లేటుగా రావడం జరుగుతుంది. ఇది గమనించిన నందమూరి తారక రామారావు మొదటి మూడు రోజులు చూశారు. ఆ మూడు రోజులు నటి విజయ చాలా ఆలస్యంగా వచ్చారు. దీనితో ఆయనకు కోపం వచ్చి చిత్ర బృందం తరపున ఆమెకు నోటీసులు పంపారు. ఆ నోటీసులో మీరు సినిమా షూటింగ్ కి మూడు రోజులు ఆలస్యంగా వస్తున్నందుకు మీ వల్ల ఇంత నష్ట పోయాను అంటూ ఈ సొమ్ము మీరు చెల్లించాలి అని అందులో ఉంది.

దీనితో భయపడిపోయిన విజయ గారు నందమూరి తారకరామారావు గారి దగ్గరికి వెళ్లి నేను చేసింది తప్పే నన్ను క్షమించండి అంటూ ఈ నోటీసును వెనక్కి తీసుకోమని ఆయనతో అడగడం జరిగింది. ఆ నోటీసులు నందమూరి తారకరామారావు వెనక్కి తీసుకున్నారు అది వేరే సంగతి. ఇక అప్పటినుంచి నటి విజయ ఎవరి సినిమా అయినా సరే కరెక్టు సమయపాలన కొనసాగిస్తారు. ఇకపోతే కట్టుదిట్టమైన నియమ నిబంధనలు ఉన్న రోజుల్లో నటన పట్ల ఆసక్తి తో వారు సినిమాలు చేసేవారు. ప్రస్తుతం ఉన్న హీరోలు కూడా ఇలాంటి కట్టుదిట్టంగా ఉండి సినిమాలు చేస్తే మన తెలుగు చిత్రపరిశ్రమ ఎక్కడికో వెళ్ళిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here