దేశంలో చక్కెర ధరలు స్థిరంగా ఉండేలా చూడటంతో పాటు దేశీయ సరఫరాకు ఎలాంటి లోటు లేకుండా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చక్కెర ఎగుమతులను తక్షణమే నిలిపివేస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆంక్షలు సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నిర్ణయం ప్రకారం ముడి చక్కెర, తెల్ల చక్కెర, శుద్ధి చేసిన చక్కెర ఎగుమతులపై పూర్తిగా నిషేధం అమలులో ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం మినహాయింపులు ఇచ్చారు. యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాలకు కోటా విధానంలో జరిగే సరఫరాలు, అలాగే ప్రభుత్వాల మధ్య ఆహార భద్రత ఒప్పందాల కింద జరిగే ఎగుమతులకు ఈ ఆంక్షలు వర్తించవు.
అంతేకాకుండా నోటిఫికేషన్ వెలువడే ముందు ప్రారంభమైన ఎగుమతి ప్రక్రియలకు కూడా కొంత ఊరట ఇచ్చారు. నౌకలో లోడింగ్ ప్రారంభమై ఉండటం, షిప్పింగ్ బిల్లు దాఖలై ఉండటం లేదా కస్టమ్స్ వద్ద సరుకు అప్పగించబడిన సందర్భాల్లో ఆ ఎగుమతులు కొనసాగేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.
దేశంలో చెరకు ఉత్పత్తి తగ్గే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల్లో దిగుబడి తగ్గడం, వాతావరణ పరిస్థితుల ప్రభావం కారణంగా వచ్చే సీజన్‌లో ఉత్పత్తి తగ్గొచ్చని అంచనాలు ఉన్నాయి. దీంతో దేశీయ అవసరాలకు తగిన నిల్వలు ఉండేలా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.
ఇప్పటికే వ్యాపారులు భారీగా ఎగుమతి ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో ఈ నిషేధం వారికి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరిలో ఇచ్చిన అనుమతుల ఆధారంగా లక్షల టన్నుల చక్కెర ఇప్పటికే విదేశాలకు వెళ్లినట్లు సమాచారం.
కేంద్ర నిర్ణయం ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌పైనా కనిపించింది. ప్రకటన వెలువడిన వెంటనే ప్రపంచ మార్కెట్‌లో చక్కెర ధరలు గణనీయంగా పెరిగాయి. భారత నిర్ణయం కారణంగా సరఫరా తగ్గుతుందనే ఆందోళనతో ట్రేడింగ్‌లో ధరలు పైకి ఎగిశాయి.
మొత్తంగా దేశీయ అవసరాలు, ధరల నియంత్రణ లక్ష్యంగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే నెలల్లో చక్కెర మార్కెట్‌పై కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.




























