భారతదేశంలో గత కొన్నేళ్ల నుంచి క్యాబ్ లో ప్రయాణించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా విద్యార్థులు, యువత, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, వ్యాపారులు క్యాబ్ ల ద్వారా ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కరోనా విజృంభణ, లాక్ డౌన్ కు ముందు తక్కువ మొత్తం చెల్లించి క్యాబ్ లలో ప్రయాణం చేసిన ప్రయాణికులకు ప్రస్తుతం వసూలు చేస్తున్న ఛార్జీలు బెంబేలెత్తిస్తున్నాయి.

కొన్ని క్యాబ్ లు గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. దీంతో క్యాబ్ లలో ప్రయాణం చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పెరిగిన ఛార్జీల వల్ల చాలామంది ప్రయాణికులు క్యాబ్ ప్రయాణం అంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. లాక్ డౌన్ వల్ల గతంతో పోలిస్తే క్యాబ్ ల ద్వారా ప్రయాణం చేసే ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గడంతో ఛార్జీలను పెంచినట్టు తెలుస్తోంది.

నగరాల్లోని అన్ని రూట్లలో ఛార్జీలు పెరగడంతో కొందరు ప్రయాణికులు ప్రయాణం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. కొంతమంది సిటీ బస్సులు అందుబాటులో లేకపోవడం వల్ల క్యాబ్ లను ఆశ్రయిస్తున్నామని.. క్యాబ్ సంస్థలు నిబంధనలను ఉల్లంఘించి ప్రయాణికులను దోచుకుంటున్నాయని మరి కొందరు ప్రయాణికులు ఆరోపణలు చేస్తున్నారు.

మరోవైపు ఆటోడ్రైవర్లు సైతం ప్రస్తుతం 20 నుంచి 25 శాతం ఛార్జీలను పెంచి ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారు. అయితే క్యాబ్ డ్రైవర్లు మాత్రం ఛార్జీలు పెరిగినా తమ వేతనాల్లో పెద్దగా మార్పు లేదని.. క్యాబ్ సంస్థలు డ్రైవర్ల నుంచి పెద్దమొత్తంలో కమీషన్లను తీసుకుంటాయని తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here