Silk Smitha : సిల్క్ స్మిత.. మత్తు కళ్ళతో కుర్రకారుని పడేసిన ఒకప్పటి శృంగార దేవత. సిల్క్ ఒక్కసారి సినిమాలో కనిపిస్తే ఆ సినిమ హిట్ అనేంతలా క్రేజ్ సంపాదించుకున్న ఈ డస్కీ బ్యూటి అసలు శృంగార తారగా ఎలా మారింది… 400 పైగా సినిమాల్లో నటించిన సిల్క్ అంతే త్వరగా తన జీవితాన్ని ఎలా ముగించుకుంది. ఆమె మరణించినా ఎవరూ ఆమెను ఎందుకు పట్టించుకోలేదు. కానీ బాలీవుడ్ లో ‘డర్టీ పిక్చర్’ సినిమాతో మరో సారి ఆమె తెర పైకి వచ్చింది. సిల్క్ అసలు స్టోరీ ఏమిటి… ఎందుకంత ఆమె పాపులర్ ఈ విషయాలను తెలుసుకుందాం….

సిల్క్ కొరికిన ఆపిల్ ఇరవై ఐదు వేలు…
సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. సిల్క్ స్మిత ది ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు లో 1960 డిసెంబర్ 2న జన్మించింది. నాలుగో తరగతి వరకు చదివిన ఆమె కుటుంబం ఆర్థిక పరిస్థితి కారణంగా చదువు ఆపేసింది. చిన్న వయసు నుండే సినిమాలంటే పిచ్చి ఉన్న విజయలక్ష్మి సినిమాల్లోకి వెళ్లాలని గట్టిగా అనుకుంది. ఇక అదే సమయంలో వాల్ ఉరి దగ్గర సినిమా షూటింగ్ జరుగుతొంటే అక్కడికి వెళ్లి డైరెక్టర్ ను రోజూ బ్రతిమాలడంతో ఒక చిన్న అవకాశం అందుకుంది.
ఇక ఆ తరువాత అక్కడ ఉంటే సినిమా హీరోయిన్ అవ్వలేనని చెన్నై వెళ్లాలని డిసైడ్ అయి తనని పెంచిన పెద్దమ్మను తీసుకుని చెన్నై వెళ్ళిపోయింది. ఇక అక్కడ నటి ఛాయా దేవి ఇంట్లో అద్దెకు ఉంటూ ఆమె తో పాటు షూటింగలకు వెళ్తూ అవకాశాల కోసం ప్రయత్నించింది. అదే సమయంలో టచ్ అప్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. అలా దొరికినా చిన్న అవకాశాలను చేస్తూ వెళ్తున్న విజయలక్ష్మి ని సిల్క్ గా మార్చిన చిత్రం 1979 లో విడుదల అయిన వండిచక్రం. ఆ సినిమాలో విజయలక్ష్మి నటించిన పాత్ర పేరు సిల్క్ అలా ఆమె ఫేమస్ అయింది. ఇక మలయాళం సినిమాలో అవకాశం వచ్చి అక్కడ సినిమా చేసిన సమయంలో డైరెక్టర్ ఆంటోనీ ఆమె పేరును స్మిత గా మార్చారు. అలా సిల్క్ స్మితగా మారిన విజయలక్ష్మి ఇక వెను దిరిగి చూసుకోలేదు.

వాంప్ పాత్రలకు బాగా ఫేమస్ అయిపోయి ఒకానొక దశలో సిల్క్ తో ఐటమ్ సాంగ్ ఉంటేనే సినిమా హిట్ అనే దశకు చేరుకుంది. అలా దాదాపు రెండువందలకు పైగా నటించిన సిల్క్ క్రేజ్ ఎంతగా ఉండేదంటే హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్న ఏకైక నటి అప్పట్లో. అలాగే ఆమె కొరికిన ఆపిల్ వేలం వేస్తే ఇరవై ఐదువేలు పలకడం అప్పట్లో సంచలనం. అంత క్రేజ్ సంపాదించుకున్న సిల్క్ నా అనేవాళ్ళు లేకపోవడం వల్ల ఒక మేనేజర్ ను బాగా నమ్మి మోసపోయిందని వార్తలు వినిపించాయి. అలాగే కొందరు డైరెక్టర్లు ప్రేమ పేరుతో ఆమెను మోసం చేసారు. ఇవన్నీ కాక సొంత నిర్మాణంలో సినిమాలను తీసి నష్టపోయింది.
కెరీర్ పడిపోయి సిల్క్ ఆర్థిక కష్టాల్లో ఉన్న సమయంలో 93 లో మళ్ళీ సినిమాలు చేసిన సిల్క్ అప్పటికే తనను చాలా మంది మోసం చేయడం, మేనేజర్ గా పనిచేసిన వ్యక్తి డాక్టర్ రాధాకృష్ణ ఆమెను మోసం చేయడం తో 1996 సెప్టెంబర్ 23 న స్మిత తన ఇంట్లో ఉరి వేసుకుని మరణించింది. స్మిత వాంప్ పాత్రలను చేసినా తాను మృధుస్వభావి అని తనతో పనిచేసిన వారు చెబుతారు. ఆమె ఆస్తిని మేనేజర్ తన పేరు మీదకు మార్చుకున్నాడనే వాదన ఉంది. ఏదేమైనా చీకటిలో మళ్ళీ వెలుగు వస్తుందని ఎదురుచూడక అర్థాంతరంగా తన జీవితాన్ని ముంగించింది సిల్క్.