Singer & Music Director Yadagiri : ఆ పాట కంపోజ్ చేసింది నేనే కానీ క్రెడిట్ మొత్తం కీరవాణికే వెళ్ళింది.. కనీసం పాటైనా నన్ను పాడనివ్వలేదు. : యాదగిరి

0
1407

Singer & Music Director Yadagiri : ఆత్మవిశ్వాసంతో ఇంట్లో వాళ్లకు పాటల పోటీకి వెళ్తున్నానని అబద్దం చెప్పి స్నేహితుడితో కలిసి హైదరాబాద్‌ బయల్దేరాడు. అక్కడ ఓ ఇంట్లో ‘లేడీబాస్‌’ తెలుగు సినిమా చిత్రీకరణ జరుగుతోంది. లోపల్నుంచి బయటికొచ్చిన ఓ పెద్దాయనకి యాదగిరి తన గురించి చెప్పాడు. ఓ పాట విని బావుందనిపించి కూర్చోబెట్టారు. కానీ దర్శకుడు ఎంతకీ రాకపోవడంతో, ఇతడికి ఒక చిరునామా ఇచ్చి మరుసటి రోజు కలవమన్నారు. అవన్నీ వర్కౌట్ కాలేదు ఆ తర్వాత యాదగిరి తిరిగి ఇంటికి వచ్చారు. తన సొంతూరులో చాలా రోజులు కష్టపడి పదిహేను వందలు కూడబెట్టాడు. ఆ డబ్బులు తీసుకొని మళ్లీ ఇస్తానని చెప్పిన వీళ్ళ అన్నయ్య, తీరా హైదరాబాద్‌ వెళ్దామనుకున్న సమయానికి డబ్బులు ఖర్చయ్యాయని చేతులెత్తేశాడు. ఇతడు ఏడ్చి గొడవ చేస్తే నూట యాభై రూపాయలు చేతిలో పెట్టాడు. ఆ డబ్బులు తీసుకొని, కొన్ని అటుకులూ, పిండి వంటలూ బ్యాగులో వేసుకొని గాయకుడిని కావాలన్న ఆశతో హైదరాబాద్‌ బయల్దేరాడు. అక్కడ ఎవరిని కలవాలో తెలీక నాలుగు రోజుల పాటు బస్టాండ్‌లోనే ఉంటూ తెచ్చుకున్నవేవో తింటూ అక్కడే పడుకున్నాడు.

అక్కడ దినపత్రిక చూస్తుంటే దర్శకుడు సానా యాదిరెడ్డి కొత్తవాళ్లతో సినిమా ప్రారంభించినట్లు కనిపించింది.
మరుసటి రోజు తను రాసుకున్న ఓ ఐదు పాటల్ని యాదిరెడ్డి, ఎల్బీశ్రీరాం లాంటి వాళ్లంతా కూర్చొని ఉంటే వినిపించాడు. వాళ్లందరికీ రెండు పాటలు బాగా నచ్చాయి. వాటిని సినిమాలో వాడుకుంటామని చెప్పారు. అలా తొలిసారి వాళ్ల వల్లే తను బాగా రాస్తానన్న విషయం ఇతడికి తెలిసింది. రెండు మూడు నెలల తరువాత ఆ పాటలు తీసుకున్నందుకు కొన్ని డబ్బులిచ్చారు. అలా “ప్రేమ పల్లకి” సినిమాతో గాయకుడు కాబోయి అనుకోకుండా రచయితగా మారాడు. ఆ సినిమాని మయూరి సంస్థ పంపిణీ చేసింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ చిత్రంలో “నీకు సినిమా చూపిస్త మావా.. నీకు సినిమా చూపిస్తా మావా… అనే పాట యాదగిరికి ఎక్కువ పేరు తీసుకువచ్చింది.

అయితే ఆయన ఒక న్యూస్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బ్యాచిలర్స్ సినిమా హీరో సత్యతో పరిచయం ఉండడం మూలంగా ఆయన ముందు నేను రాసుకొని కంపోజ్ చేసిన ‘నచ్చావే.. నవ్వుల గోపమ్మ… అనే పాటను పాడి వినిపించాను. అప్పుడు ఆయన తను సోలో హీరోగా ఓ సినిమా చేస్తున్నాను. ఆ సినిమాలో ఈ పాటని తీసుకుంటానని చెప్పారు. ఈ పాట నా కోసం నేను పాడాలని రాసుకున్నాను. నేను పాడితేనే మీ సినిమాకి ఇస్తానని సత్యతో చెప్పాను. సరే కచ్చితంగా నువ్వే పాడాలని కూడా అన్నారు. 2000 సంవత్సరంలో షూటింగ్ ప్రారంభమై‌ 2004లో విడుదలైన ‘వరం’ సినిమాకి ముందుగా సంగీత దర్శకునిగా గంటాడి కృష్ణను అనుకున్నారు. ఆ తర్వాత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుందని ఎం.ఎం. కీరవాణిని సంప్రదించారు. అప్పటికే అన్నమయ్య లాంటి విజయవంతమైన చిత్రానికి సంగీతం సమకూర్చారు.అలాగే ఆయన లాహిరి లాహిరి లాహిరి, స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. అలా ఎం ఎం కీరవాణి ఒప్పుకోవడంతో… మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయననే తీసుకున్నారు.

ఒకసారి నిర్మాత నందు, హీరో సత్య కలిసి నా దగ్గరికి వచ్చి నేను కంపోజ్ చేసిన పాటను ఒకసారి కీరవాణికి వినిపిస్తే బాగుంటుందన్నారు. అలా మేము ముగ్గురం కలిసి కీరవాణి గారి ఇంటికి వెళ్ళాం. నా పాటను నేను వినిపించడంతో కీరవాణి నన్ను అభినందించి నాతోనే సినిమాలో పాట పాడించాలన్నారు. అలా కీరవాణి చెప్పడంతో నా సంతోషానికి అవధులు లేవు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో గాని ఆ పాటను దర్శక, నిర్మాతలు ఉదిత్ నారాయణ్ తో పాడించాలి అనుకున్నారు. ఆ విషయం నాకు తెలియగానే నేను అవాక్కయ్యాను. దురదృష్టమేంటంటే ఆ పాటను ఉదిత్ నారాయణ్ కు నేర్పిస్తూ స్వయంగా దగ్గరుండి నేనే పాడించాను. ఆ తర్వాత ఆ పాట నేను పాడలేకపోయానని దాదాపు ఒక మూడు నెలలు నాలో నేను ఏడ్చాను. అయితే కీరవాణి ‘వరం’ సినిమా పాటల క్యాసెట్ పై ఆ పాటకి నా పేరే వేయాలంటూ చెప్పారు. కానీ దర్శక నిర్మాతలు క్యాసెట్స్ పై నా పేరు కూడా వేయలేదు అంటూ..రచయిత సంగీత దర్శకులు యాదగిరి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.