ప్రముఖ టాలీవుడ్ సింగర్ స్మిత భారత ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన సంతృప్తికరంగా లేదంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..

ఈమధ్య మీడియాకిచ్చిన ఒక ఇంటర్వ్యూలో సింగర్ స్మిత బీజేపీ ప్రభుత్వంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. సమాజంలో కులం ప్రభావం చాలా ఎక్కువగా ఉందని, ఎవరైనా మాట్లాడితే చాలు నీ కులం ఏంటని అన్నీ తెలుసుకున్న తర్వాతే మరో టాపిక్ గురించి చర్చిస్తున్నారని, కానీ తనకు మాత్రం ఈ కులానికి సంబంధించిన విషయాలేవీ డిగ్రీ చదివే వరకు తెలియదని, చెబుతూనే సింగర్ స్మిత రాజకీయాంశాల గురించి మాట్లాడుతూ.. ఎన్నికల టైంలో ఎవరికి మద్దతివ్వాలి అనే అంశంపై అప్పటి పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకున్నానంటూ వివరణ ఇచ్చింది. పాలిటిక్స్ అంటే తనకు ఇష్టం లేదని, ఒకవేళ రాజకీయ రంగంలోకి అడుగు పెట్టినా స్వేచ్ఛగా నిర్ణయాలు చెప్పే స్వాతంత్ర్యం నేటికాలంలో ఏ పార్టీలోనూ లేదని, అందుకే రాజకీయాలంటేనే ఇష్టం లేదని సింగర్ స్మిత క్లారిటీ ఇచ్చింది.

ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన విషయాన్ని చెబుతూ.. గత ఎన్నికలలో నరేంద్ర మోడీకి అనవసరంగా మద్దతిచ్చానని షాకింగ్ కామెంట్ చేసింది. ప్రస్తుతం మోడీ పరిపాలన తాననుకున్నట్టుగా ఏమీ లేదని, ప్రధాని పరిపాలనపై పెట్టుకున్న అంచనాలవీ ఆయన అందుకోలేకపోయారంటూ సంచలన కామెంట్స్ చేసింది. గతంలో నరేంద్ర మోడీకి అనుకూలంగానే స్మిత ఆల్బమ్ చేసిందన్న సంగతి తెలిసిందే. అలాంటి సింగర్ స్మిత ఊహించని విధంగా ఇలా సంచలన కామెంట్స్ చేయటంతో ఒక్కసారిగా సింగర్ స్మితకు సంబంధించిన లేటెస్ట్ కామెంట్స్ ఆన్నీ సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నయి.



























