Sobhan Babu : తెలుగులో గ్లామర్ హీరో అనగానే గుర్తొచ్చేది అప్పట్లో శోభన్ బాబు గారు. అశేష మహిళా ప్రేక్షక ఆదరణ ఆయన సొంతం. నవలానాయకుడిగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబు గారు ఆర్థిక క్రమశిక్షణలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ అందరికీ ఆదర్శమనే చెప్పాలి. తొలిరోజుల్లో ఎంతో కష్టపడి పైకి వచ్చిన అయన బాగా డబ్బు సంపాదించినా అంతే ఆర్ధిక క్రమశిక్షణతో మెలిగారు. అలాగే తన పిల్లలను ఇండస్ట్రీకి దూరంగా పెంచారు. ఆయన తన జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకున్నారో అలానే జీవించి మరణించారు.

దాదాపు 80 వేల కోట్ల పైనే…
శోభన్ బాబు గారు డిగ్రీ పూర్తి అయ్యాక మద్రాస్ కు సినిమాల్లో నటించాలనే కోరికతో వచ్చారు. లా చదువుతూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారు. మొదట్లో చిన్న చిన్న వేషాలను కూడా వేసారు శోభన్ బాబు గారు. అప్పటికే పెళ్ళై నలుగురు పిల్లలు ఉన్న శోభన్ బాబు గారు ఎంతోకొంత డబ్బు వస్తుంది కదా అని చిన్న వేషం అయినా నటించేవారు. చివరికి ఒక సినిమాలో లీడ్ రోల్ రావడంతో ఆయన ఇక వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా అయింది. స్టార్ హీరోగా ఎదిగారు, ఇక అయన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఆహారం విషయంలో చాలా కంట్రోల్ లో ఉంటారు.

ఇక శోభన్ బాబు గారు మంచి బిజినెస్ మాన్ అని తన తోటి నటులైన మురళీ మోహన్ గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. శోభన్ బాబు గారు తాను సంపాదించినది చాలా వరకు భూములు కొనడానికి కేటాయించారట, భూమి మీద పెట్టిన డబ్బు ఎక్కడికీ పోదు అని గట్టిగా నమ్మేవారట. ఇక 1976 లోనే చాలా కంపెనీల షేర్స్ కొన్నారని, అప్పటికి చాలామందికి షేర్స్ అంటే ఏంటో కూడా పెద్దగా తెలియదని మురళీ మోహన్ గారు చెప్పారు. శోభన్ బాబు గారు చెన్నైలో ఇంకా చెన్నై చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాల భూమిని కొన్నారని చెప్పారు. చాలా ఇల్లులు కూడా కట్టించారని, అవి అన్నీ తిరిగి రావటానికి కనీసం ఒక రోజు పడుతుందని చెప్పారు. శోభన్ బాబు గారు చనిపోయే నాటికి ఆయన ఆస్తుల విలువ లెక్కగడితే దాదాపు 80వేల కోట్లు ఉంటుందని, ఇండస్ట్రీలో ఆయన అంతటి అస్తిపరులు లేరని చెప్తారు మురళీ మోహన్ గారు.
































