సోనూసూద్ రీల్ లైఫ్‌లో విలన్.! ఎన్నో సినిమాలలో వెండితెరపై విలనిజాన్ని పండించాడు. విలనిజం అంటే అది అని చూపించాడు. ప్రేక్షకుల్లో అదే ముద్ర వేసుకున్నాడు. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం అతడు హీరో. ఈమధ్య కాలంలో అతను చేస్తున్న పనులే అతడికి సమాజంలో మంచి పేరును తెచ్చి పెట్టాయ్. ఇంతకీ సోనూసూద్ ఏం చేశాడు.? ఇంతలోనే అంత ఇమేజ్ ఎలా పొందగలిగాడు.?

సోనూ సూద్.. ఇది కేవలం పేరు కాదు. వలస కూలీల పాలిట దైవత్వం. కరోనా రక్కసి కోరల్లో చిక్కుకున్న వేలాదిమంది వలస కార్మికులకు దారి చూపించాడు. ఆపదలో ఉన్నామని ఎవరు సహాయం ఆర్ధించినా కాదనకుండా సహాయం చేశాడు. అంతటితో ఆగకుండా దేశంలో ఎక్కడ.. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన వంతు సహాయం చేసి అందరినీ ఆదుకుంటూ పేదల పాలిట పెన్నిధిగా మారాడు. సోనూ సూద్ ది వెన్నలాంటి మనసు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే కరిగి పోతాడు. ఆ కష్టం తనదే అన్నట్టుగా ఫీలవుతాడు. ఆపదలో ఉన్నానని ఎవరు సాయం కోరినా నేనున్నాను అంటూ క్షణాల్లో ఆదుకుని అండగా ఉంటాడు. కష్టంలో ఉన్న ఏ కుటుంబాన్ని చూసినా ఇట్టే చలించి పోతాడు. ఇదంతా ఎందుకు చదువుతున్నారంటే.. ప్రపంచం సాఫీగా సాగిపోతున్న సమయంలో కరోనా వైరస్ పెనుభూతంలా ప్రవేశించింది.

ప్రపంచ వ్యాప్తంగా రాత్రికి రాత్రే లాక్‌డౌన్ అమలు చేశారు. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచి పోయింది. వలస కార్మికులు.. నిరుపేదలు ఎక్కడివాళ్ళు అక్కడే స్తంభించి పోయారు. చెయ్యడానికి పనిలేదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు. సొంత ఊరికి వెళ్దామంటే రవాణా సౌకర్యం లేదు. ఇలా వలస కూలీల అవస్థలు అన్నీ చూసి చలించిపోయిన సోనూసూద్ పెద్ద మనుసు చేసుకుని కూలీలను తన స్వంత డబ్బులతో వారి స్వస్థలాలకు పంపించాడు. ప్రభుత్వాలు, పెద్ద పెద్ద వ్యాపార సంస్ధలు కూడా చేయలేని పనిని క్షణంలో ఎంతో ధైర్యంతో ఖర్చుకు వెనుకాడకుండా తన వంతు సహాయం చేశాడు. వలస కూలీల పాలిట దేవుడయ్యాడు. అంతే కాకుండా కరోనా మూలంగా చెల్లాచెదురైన జీవితాలను ఆదుకుని తన ఉదారతను చాటుకున్నాడు. రాజకీయ నాయకులందరిలాగ.. సినిమా సెలబ్రిటీల్లాగ కేవలం ట్వీట్లు.. ఉపన్యాసాలకు పరిమితం కాకుండా ఆపద సమయంలో చేయందించి రియల్ హీరోగా అనిపించుకున్నాడు.

తన వల్ల సమాజానికి ఎంతో కొంత మేలు జరగాలనే సత్సంకల్పంతో ముందడుగు వేశాడు. కరోనా మహమ్మారి వలన చాలామంది చనిపోవడం చూసి కలత చెందాడు. సోనూ సూద్ ఎప్పుడూ అవార్డుల కోసమో, గుర్తింపు కోసమో ప్రయత్నించలేదు. వేలాదిమందికి ఉపాధి కల్పించాలనే మంచి ఆశయంతోనే ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టాడు. దీంతో సోనుసూద్ పేరు ఒక్కసారిగా దేశం మొత్తం మారు మ్రోగిపోయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సోనూసూద్ రాజకీయాల్లో రావడానికి ట్రై చేస్తున్నారని కొన్ని పార్టీలకు చెందిన నాయకులు ఆయనపై సెటైరికల్ గా విమర్శలు చేయడం జరిగింది. లాక్ డౌన్ సమయంలో సోనూసూద్ కి ప్రత్యేకమైన బస్సులు ఎవరిచ్చారని, ఏ ప్రభుత్వం అండగా ఉందంటూ రకరకాలుగా కామెంట్స్ షేర్ చేశారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఓ ప్రముఖ టీవీ ఛానల్ సోనూ సూద్ ని ఇంటర్వ్యూ చేస్తూ.. ‘భవిష్యత్ లో మీకు రాజకీయ రంగ ప్రవేశం చేసే ఆలోచన ఏమైనా వుందా.?’ అనడిగారు. ఆ ప్రశ్నకు స్పందించిన సోనూ సూద్ పొలిటికల్ ఎంట్రీ గురించి తన మనసులోని మాటను బయట పెట్టాడు. ‘తనకు రాజకీయ రంగం అంటే ఇష్టం లేదని, ఇప్పటికే అనేక అవకాశాలు వచ్చాయి కానీ తనకు సినిమా రంగం అంటేనే ఇష్టమని, అలాగే తనకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ప్రధాని మోడీ’ అని తెలియజేశారు.



























