ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలు త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు, ఫాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు. సినీ నటుడు కమల్ హాసన్ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లారు. బాలు ఆరోగ్యపరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స జరుగుతోందని తెలిపారు. మరోవైపు ఎస్పీ బాలు కుటుంబసభ్యులు ఇప్పటికే ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ..అందరూ ప్రార్థనలు చేయాలని మ్యూజిక్ డైరెక్టర్లు దేవీ శ్రీ ప్రసాద్, ఎస్ థమన్ ట్వీట్ చేశారు. 24 గంటల్లో ఎస్పీ బాలు ఆరోగ్యం మరింత క్షీణించిందని, ఆయనకు ఎక్మో, వెంటిలేటర్ పైనే చికిత్స కొనసాగుతుందని వైద్యులు ప్రత్యేక బులెటిన్ లో ఇప్పటికే ప్రకటించారు. ఆసుపత్రి వద్ద ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. బాలు ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఒక్కొక్కరుగా ప్రముఖులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. దీంతో ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని బాలు ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు.

బుధవారం రాత్రి నుంచి బాలు తీవ్ర జ్వరం తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. 10 మంది మెరుగైన వైద్యుల పర్యవేక్షణలో బాలు ఆరోగ్యాన్ని కుదటపరిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం బాలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్దపెట్టి సహకారం అందిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ వైద్యులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఫాన్స్ కూడా భారీగా తరలివస్తుండటంతో హాస్పిటల్ పరిసరాల్లో ఆంక్షలు విధించారు. ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. కరోనా పరిస్థితుల కారణంగా అభిమానులు, శ్రేయోభిలాషులు హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ఉండకూడదు అని హెచ్చరిస్తున్నారు. బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందనే విషయం తెలుసుకొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాస్పిటల్ వర్గాలతో ఫోన్ లో మాట్లాడారు. మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.



























