తరతరాలకు తన్మయ తరంగమై పల్లవిస్తున్న ఆ గాంధర్వ స్వరమే ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం. పలుకులమ్మ పరిపూర్ణ అనుగ్రహంతో, గానకళాకోవిదుడై, తెలుగు యశస్సుకు తార్కాణంగా నిలిచిన నిత్య గాయకుడు, నిఖిల గాయకుడు. బాలుగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అన్ని భాషల్నీ అమ్మ భాషలుగా చేసుకున్నారు. ఆయా భాషల్లోని మాటల భావాత్మని తన గొంతులో పలికించారు. ఆ భాషల శ్రోతలకు గళపరిమళాన్ని పంచి, స్వర సామ్రాజ్య చక్రవర్తిగా ఎదిగారు. అలాంటి బాలు మన తెలుగువాడు కావడం మనం మరీ మరీ మురిసిపోవలసిన విషయం. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తన ఆఖరి కోరిక తీరకుండానే స్వర్గంలోని ఆ దేవతలను తన గానామృతంతో అలరించడానికి తుదిశ్వాస విడిచారు. బతికి ఉండగానే చూడాలనుకున్నది చూడకుండానే కన్నుమూశారు. ఇంతకీ.. మన గాన గంధర్వుని చివరి కోరిక ఏమిటో తెలుసా?

2020 ఆగస్టు నెలలో కోవిడ్-19 వ్యాధి సోకగా ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయనకు కరోనా సోకకముందే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంతో ఇష్టపడి తన విగ్రహాన్ని తయారు చేయించుకున్నారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 25 సెప్టెంబర్ 2020 న చెన్నయ్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో మరణించిన సంగతి తెలిసిందే.! అయితే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం జీవం పోసుకుంటోంది. బాలసుబ్రహ్మణ్యం ఏడాది క్రితమే తన విగ్రహం తయారు చేయించుకోవాలనే కోరిక కలగటంతో కొత్త పేటకు చెందిన ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్‌ను సంప్రదించారట. 2019 నవంబర్ నెలలో బాలు తన తండ్రి పండితారాద్యుల సాంబమూర్తి విగ్రహాన్ని తయారు చేయించడానికి కొత్తపేటకు వచ్చారు. ఆ సందర్భంలోనే తన విగ్రహాఁ కూడా తయారు చేయించుకోవాలని ముచ్చట పడిన బాలు తన విగ్రహం తయారు చెయ్యడానికి కావాల్సిన ఫొటోలను కూడా తీయించుకున్నారు. అలా తయారైన విగ్రహాన్ని చెన్నైలోని బాలు ధియేటర్‌లో పెట్టుకోవాలనేది ఆయన చివరి కోరిక. కానీ ఈమధ్యనే బాలుకి కరోనా వైరస్ సోకడంతో విగ్రహం పూర్తి కాకుండానే బాలు మృతి చెందారు.

ఆయన కరోనాతో హాస్పిటల్ లో చేరారని తెలిసిన వెంటనే శిల్పి రాజ్ కుమార్ వడయార్ విగ్రహం తయారు చేయడం మొదలుపెట్టారు. బాలు సజీవంగా ఉండగానే విగ్రహం తయారు చేసి ఇవ్వాలని శిల్పి రాజ్ కుమార్ ఎంతగానో శ్రమించి గాన గంధ్వరుడిని చిరకాలం స్మరించుకునేలా ఆ ప్రతిమకు ప్రాణం పోస్తున్నారు. కానీ.. ఆ విగ్రహం పూర్తయ్యేలోపే బాలు శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. బాలసుబ్రహ్మణ్యం మరణం తనను మానశికంగా ఎంతగానో బాధిస్తుందని, వీలైనంత త్వరగా బాలు గారి విగ్రహాన్ని పూర్తి చేసి చెన్నై పంపిస్తానని శిల్పి రాజ్‌కుమార్ వడయార్ తెలియజేసారు. రాజకుమార్ వడయార్ ఇదివరకే ఎంతో మంది ప్రముఖుల కాంస్య విగ్రహాలను తయారు చేసి మంచి పేరు సంపాదించారు. ఎంజీఆర్, జయలలిత తదితర ప్రముఖుల విగ్రహాలను తయారు చేశారు. అలాంటి శిల్పి చేత మన బాలు తన విగ్రహాన్ని తయారుచెయ్యమని చెప్పడం నిజంగా సంస్కారవంతమైన లక్షణమని చెప్పాలి.

వాస్తవానికి బాల సుబ్రహ్మణ్యం గారి చివరి కోరిక ఇదే అవుతుందని అప్పుడు ఎవ్వరూ ఊహించి ఉండరు. సెప్టెంబర్ 25న మరణించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని ఆయన నివాసం నుంచి వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. చెన్నైలోని ఆయన స్వగృహం నుంచి తామరైపాక్కంలోని ఫాంహౌస్‌కు బాలు భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లారు. శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తమిళనాడు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని శుక్రవారం రాత్రే వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. అంతకుముందు ఆయన నివాసంలో గాన గంధర్వుడిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. ‘స్వర స్మారనీయుడి’కి అశ్రు నయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. భారీగా జనం వస్తూనే ఉండటంతో బాలు భౌతికకాయాన్ని ఫాంహౌస్‌కు తరలించారు. రేపు ఉదయం 7.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభవుతుంది. సంగీత లోకాన చిరయశస్సుతో జీవించాలని తపన పడ్డ గానతపస్వీ. ఈ గాన గంధర్వుడి ప్రస్థానం నిర్విరామంగా కొనసాగాలని అశేష అభిమానుల విశేష ఆకాంక్షించారు. కానీ విధి రాతలో అందరూ పాత్రధారులే కదా ఏమైతేనేం బాలు చిరస్మరణనీయుడు, స్వరస్మరణీయుడు.



























