ఆయన గొంతులో ఓంకార నాదాలు నాట్యం చేస్తాయి. ఆయన పాట పంచామృతం. ఆయన గానం స్వర రాగ గంగా ప్రవాహం. దివిలో తిరగాడే గంధర్వులు దివి నుండి భువికి దిగి వచ్చి పాడినట్లుగా ఉంటుంది ఆయన గాత్రం. ఆయన గళం నుంచి జాలు వారే.. ప్రతిస్వరం ఆ దివిలో విరిసే పారిజాతమే. ఆయన స్వరంలో సప్త స్వరాలు రాగాలై నర్తిస్తాయి. ఆయనే గాన గంధర్వుడు పద్మభూషణ్ S.p. బాల సుబ్రమణ్యం. తెలుగు చలన చిత్ర సీమకు ఆనాటి అమర గాయకుడు ఘంటసాల తరువాత లభించిన సిసలైన సంగీత వారసుడు మన బాల సుబ్రహ్మణ్యం.

కొన్ని ద‌శాబ్ధాలుగా త‌న పాట‌లతో సంగీత ప్రియులను మంత్ర‌ ముగ్ధుల‌ని చేస్తున్న ఎస్పీ బాల‌సుబ్ర‌హ్యాణ్యం ఆగ‌స్ట్ 5న క‌రోనా బారిన ప‌డి ప్ర‌స్తుతం చెన్నైలోని MGM హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన సతీమణి సావిత్రి బాల సుబ్రహ్మణ్యం కూడా కరోనా వైరస్ బారిన పడటం విషాదకరమైన వార్తే. చెన్నై హాస్పిటల్ లోనే ఈ దంపతులిద్ద‌రికి డాక్టర్లు చికిత్స‌ను అందిస్తున్నారు. అయితే Sp బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య ప‌రిస్థితి కాస్త క్షీణించ‌డంతో డాక్టర్లు ఆయనను వెంటిలేట‌ర్‌ పైనే ఉంచి ట్రీట్మెంట్ నందిస్తున్నారు. లేటెస్ట్ గా తమిళనాడు మంత్రి విజయ భాస్కర్‌ MGM హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాలును పరామర్శించి, ఆయ‌న ఆరోగ్య వివ‌రాలు కనుక్కున్నారని తెలిసింది. SP బాలుకు అయ్యే వైద్య ఖర్చుల్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కరోనా నుంచి కోలుకునేందుకు బాలుకు ప్లాస్మా చికిత్స కూడా అందిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ నేపథ్యంలో Sp బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరి ఎస్పీ శైలజ స్పందిస్తూ.. ‘‘నమస్కారమండీ.. అన్నయ్య బాలు ఆరోగ్యం రోజురోజుకూ మెరుగవుతోంది. సకాలంలో వైద్యులు ఆయనకు సరైన చికిత్సను అందిస్తున్నారు. ఇది చాలా ఆనందించదగిన విషయం. ప్రస్తుతం ఆయనకు ఉంచిన వెంటిలేటర్‌ ను తొలగించారు. మిగిలిన ట్రీట్మెంట్ యధావిధిగా కొనసాగుతుంది. అన్నయ్య కోలుకుంటున్న విధానంపై డాక్టర్లు కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా అన్నయ్య ఆరోగ్యంగా ఉండాలని ప్రపంచమంతా ప్రార్థిస్తోంది. తప్పకుండా అన్నయ్య కోలుకుని మన మధ్యకు వస్తారు. అందరికీ ధన్యవాదాలు’’ అని ఎస్పీ శైలజ ఆడియో సందేశాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. మరి మనందరం కూడా ఆ గాన గంధర్వుడు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆ దైవాన్ని ప్రార్ధించుదాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here