ఎస్.పి.శైలజ మనిషి ఎంత సుమధురమో మనసంత మధురం చీరలో నిండైన తెలుగుదనం గొంతులో మెండైన కోకిల గానం. తెరపై నటులు ఆడే ఆటకు తన పాటతో పల్లవి చరణాలనందించి అదే తెరపై తన గొంతుతో ఆయా పాత్రలకు ప్రాణం పోసింది. సినిమా అవకాశాల కోసం ఏనాడు వెంపర్లాడలేదు.

తను ఒక పెద్ద గాయనిని కావాలని వేల సినిమాలకు పాటలు పాడతానని ఆమె ఎన్నడూ ఊహించలేదు.
నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగిన ఎస్.పి.శైలజ చదువుకునే వయసులో స్కూల్ కాంపిటీషన్స్ లో పాల్గొని పాటలు పాడేవారు. ఆ విషయం తెలుసుకున్న ఆర్కెస్ట్రా గ్రూప్ వాళ్లు ఎస్.పి శైలజ తల్లిదండ్రులను సంప్రదించగా శైలజ తండ్రి గారు సుతారం ఇష్టం లేదని చెప్పారు, తల్లి గారి ప్రోద్బలంతో శైలజ ఆర్కెస్ట్రా, కచేరీలకు వెళ్లి పాటలు పాడేది.

తొమ్మిదో తరగతిలో శైలజ పాటలు విన్న సంగీత దర్శకుడు చక్రవర్తి తన సినిమాలో అవకాశం కల్పించారు. 1977 ప్రాంతంలో తన కెరీర్ ప్రారంభించిన శైలజ ఒకటి తర్వాత మరొకటి అన్నట్టుగా అనేక పాటలు పాడారు. ఒకానొక సందర్భంలో బాలసుబ్రమణ్యం కచేరీకి ఫిమేల్ సింగర్ రాకపోవడంతో శైలజతో పాడించడం జరిగింది. తన చెల్లెలు కూడా పూర్తి బెరుకు లేకుండా పాట పాడగలదని సంతోషపడినప్పటికీ ఏనాడు తన చెల్లెలికి అవకాశాలు కల్పించాలని ఏ సంగీత దర్శకులకు రికమండ్ చేయలేదు. ఎందుకంటే శైలజ తన ప్రతిభతో రాణించాలని బాలు గారు కోరుకున్నారు. దాదాపు ఎస్.పి శైలజ ఆరువేలకు పైగా పాటలు పాడి తన పాటల సుమాలను వెదజల్లారు.



























