టాలీవుడ్ టాప్ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్ సోకటంతో ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. ఆయనకు ఏమైందోనంటూ ఆందోళన చెందిన బాలు ఫ్యాన్స్ కూడా బాలు వీలైనంత త్వరగా కోలుకోవాలని, బయటికి వచ్చి మళ్లీ పాటలు పాడాలంటూ దేవుడ్ని ప్రార్థించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా, సింగర్ సునీత వంటి సినీ ప్రముఖులు కూడా బాలు త్వరగా కోలుకోవాలంటూ అంటూ వీడియోలను షేర్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తండ్రి ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చాడు. ”అందరికీ నమస్కారం. నాన్నగారి ఆరోగ్యం విషయంలో తాజా పరిస్థితి గురించి తెలుసుకునేందుకు అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలియజేయాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్యం నిలకడగానే ఉంది. హాస్పిటల్ లోని వెంటిలేటర్‌పై ఉంచడం ఆయనకెంతో ఉపయోగపడింది. నాన్నగారు ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారు. డాక్టర్లు నిరంతరం ఆయనను పర్యవేక్షిస్తున్నారు. నాన్నగారు నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడటంపై డాక్టర్లు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆయన ఈ పరిస్థితి నుంచి బయటపడి సాధారణ స్థితికి వచ్చేస్తారు. నాన్నగారి ఆరోగ్యంపై నేను ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తుంటాను. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించిన ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు” అని ఓ ఆడియోను విడుదల చేసాడు చరణ్.

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఆయన సోదరి ఎస్పీ శైలజ నిన్న ఉదయం అన్నయ్య ఆరోగ్యం రోజురోజుకీ మెరుగవుతుందని, వెంటిలేటర్ తొలగించారని తెలియజేశారు. బాలు ఫ్యాన్స్ కూడా చాలా సంతోషించారు. అయితే అదేరోజు సాయంత్రానికి మళ్ళీ ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్.. శైలజ చెప్పినదానికి విరుద్ధంగా.. “హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మా నాన్నగారికి వెంటిలేటర్ తొలగించినట్లు వస్తున్న వార్తలను నమ్మవద్దు. ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు” అంటూ తెలపడంతో ఈవిధంగా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం గురించి ఆయన కుటుంబ సభ్యులు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడంతో బాలు ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.



























