పుస్తెలమ్మి అయిన సరే పులస తినాలి అన్న సామెతను ఎప్పుడైనా విన్నారా.? అలా ఎందుకు అన్నారు.. దాని వెనుక కధ ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా పులస చేప మన గోదావరి జిల్లాలో ఎక్కువగా లభిస్తుంది. దీని ఖరీదు కేజీ సుమారు 3 వేల నుండి 5 వేల వరకు ఉంటుంది ఒక్కోసారి డిమాండ్ బట్టి 8 వేల రూపాయలు కూడా ఉంటుంది. దీనిని అమ్మెటప్పుడు వేలం పాట వేస్తారు. ఒక్కొకరు వాళ్ళ వాళ్ళ స్థోమతను బట్టి ధర పెట్టి పాడుకుంటారు.

ఈ చేప గొప్పతనం ఏమిటంటే ఎక్కడో ఆస్ట్రేలియాలో పుట్టి, న్యూజిలాండ్ వస్తుంది అక్కడ నుండి టాంజినీయా దేశం దాటినా తర్వాత హిందూ మహాసముద్రంలో కలిసి అక్కడ నుండి బంగాళాఖాతంలోకి వస్తుంది. ఎప్పుడైతే గోదావరిలో ఎర్ర నీరు వస్తుందో ఆ శ్రేష్టమైన మంచినీటిని త్రాగడానికి గోదావరి సముద్రం కలిసే అంతర్వేదిలో ఇవి ఎదురీది గోదావరిలోకి వస్తాయి. ఇక్కడ కొన్ని గుడ్లు కూడా పెడతాయి ఆ తర్వాత మళ్ళీ సముద్రంలోకి వెళ్లిపోతుంటాయి. ఆ విధంగా గోదావరిలోకి ఎదురిదుతూ వచ్చి మళ్ళీ సముద్రంలో కలిసే మధ్యలో మన జాలర్లు వీటిని పట్టుకుంటారు. ప్రవాహానికి ఎదురీదే పులస చేపలు మాములుగా అలా ఎదురు ఈదే చేపలు చాలా వరకు చచ్చిపోతాయి. వీటికి ముల్లులు ఎక్కువగా ఉండటం వలన అలా ఎదురు ఈదగలుగుతుంది. కాని ఒక్కసారి వలలో పడగానే పులస చనిపోతుంది. సముద్రంలో ఉన్నపుడు దీనిని ఇలస అని అంటారు.

ఎప్పుడైతే గోదావరిలో కలుస్తుందో అప్పుడు దీనిని పులస అంటారు. ఇలసగా ఉన్నప్పుడూ దీని ధర కేవలం 70 నుండి 120 రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ పులసగా మారిన తర్వాత దీని రేటు ఒక్కసారిగా పెరిగిపోతుంది. పుస్తెలమ్మి అయిన సరే పులస తినాలి అని ఊరికే అనలేదు దీని రుచి అలాంటిది మరి. ధర గురించి కాదు కానీ రుచి పరంగా ఒక్కసారి పులస చేప కూర వండుకుని తింటే ఇంకా మిగతావి అన్నీ దీని ముందు బలాదూర్ అనిపిస్తాయి. పుల్సాకున్న డిమాండ్ ను గుర్తించిన కొందరు జాలర్లు ఒరిస్సా నుండి అచ్చం పులసలాగే ఉండే చేపలను ఆంధ్రాకు తీసుకొచ్చి బురిడీ కొట్టించి అమ్మేస్తుంటారు. వీటి డిమాండ్ ను క్యాష్ చేసుకోవడం కోసం వీటిని గుర్తించడం చాలా తక్కువ మందికే తెలుస్తుంది. అందులోనూ పెద్దవాల్లైతే బాగా గుర్తిస్తారు. ముఖ్యంగా ఇవి వెండి రంగులో మెరుస్తుంటాయి. వీటి నోరు పసుపు రంగును పోలి ఉంటుంది.

ఈ పులసలలో కూడా మళ్ళీ 2 రకాలుంటాయి. 1. పోతు పులస 2. సెన పులస… దీనిలో ఆడ పులస అంటే సెన పులసి కి మరింత డిమాండ్ ఎక్కువ. పులస తెచ్చేస్తే సరిపోదు అండి అది వండే విధానం కూడా తెలియాలి. పులస కూరలో లేత బెండకాయలు వేసి బాగా మగ్గిన తర్వాత అలానే పక్కన పెట్టేసి ఆ తర్వాత రోజు తినాలి. వండిని రోజు కంటే ఆ రోజు వదిలేసి తర్వాత రోజు తింటే పులస రుచిని జన్మలో మర్చిపోరు. ఏంటి కూర కి అంత బిల్డప్ అవసరమా అనుకుంటారేమో… దాని రుచి అలాంటిది మరి. కావాలంటే మీరు కూడా ఒకసారి తిని చూడండి. నిజంగా చాలా బాగుందంటారు. చివరిగా ఒక చిన్న విషయం.. ఈ పులస చేపలు సంవత్సరంలో దొరికేది 3 నెలలు మాత్రమే.. అది కూడా జులై, ఆగష్టు, సెప్టెంబర్ నెలలలో మాత్రమే వీటి కోసం మన గంగపుత్రులు ప్రాణాలను సైతం పణంగా పెట్టి వీటిని పట్టుకుంటారు. ఆడండి మన పులస చేపల కథ..



























