మల్టీ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రం తాజాగా ఓటిటిలో విడుదలయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ‘కేరాఫ్ కంచెరపాలెం’ చిత్రాన్ని తెరకెక్కించిన వెంకటేష్ మహా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చెయ్యడం విశేషం. ‘మహేశింతే ప్రతీకారమ్’ అనే మలయాళం సినిమాకి ఇది రీమేక్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఎంతో సహజంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇక ఈ సినిమాలో అందరి పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయన్ చెప్పాలి. ముఖ్యంగా జ్యోతి పాత్రలో నటించిన హీరోయిన్ గురించి మాత్రం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మేకప్ లేకుండా ఎంతో సహజంగా గా కనిపించింది ఈ అందాల భామ. సహజ సిద్ధమైన అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ నటి అందరిలా కాదు.. చాలా ప్రత్యేకం. ఆశ్చర్యకరమైన విశేషమేమిటంటే.. ఈమె గురించి ఇప్పుడు గూగుల్ లో నెటిజన్లందరు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. అలాంటివారి కోసం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

నిజ జీవితంలో కూడా ఈమె పేరు రూప కొడువయుర్ అనేది మీరు ఊహించని మొదటి ట్విస్ట్ అయితే ఈమె ఒక డాక్టర్ అన్న విషయం 2వ ట్విస్ట్ గా చెప్పాలి. చాలా మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెబుతుంటారు. కానీ, ఈమె డాక్టర్ అయి ఆ తరవాత యాక్టర్ అయ్యారు. చిన్నప్పటి నుండీ డ్యాన్స్ లు.. ఫైన్ ఆర్ట్స్ వంటి వాటిని కూడా చాలా శ్రద్ధగా నేర్చుకుంది. తనకు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. ‘సాహోరే బాహుబలి’ పాటకు తదైనా శైలిలో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి ఆ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ లో అప్‌లోడ్చేసింది రూప. ఆ వీడియోలో తన డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో రూపకు మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా కళాతపస్వీ కె.విశ్వనాథ్ సినిమాల్లోని పాటలకు ఆమె చేసిన నృత్యాలకు కూడా మంచి గుర్తింపు వచ్చినట్టు రూపఏ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది.

రూప జాతీయ స్థాయిలో వెయ్యికి పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె తల్లి మంగ లక్ష్మి సంస్కృతం లెక్చరర్, తండ్రి రవికుమార్ ఆర్మీలో పనిచేస్తున్నారు. రూప ప్రాథమిక విద్య విజయవాడలోని అమాలి స్కూల్, శ్రీ చైతన్య స్కూల్‌లో జరిగింది. అయితే, రూప డాక్టర్ అయితే చూడాలనేది తల్లి కోరిక. తల్లి కలను సాకారం చేయడం కోసం రూప ఎంతో కష్టపడి చదివారు. ఎంసెట్‌లో ఆమెకు మంచి ర్యాంక్ వచ్చింది. దీంతో గుంటూరులోని కాటూరి మెడికల్ కాలేజీలో ఆమెకు ఫ్రీ సీట్ లభించింది. అయితే, తాను ఎంసెట్‌కు ప్రిపేర్ అయ్యేటప్పుడు తన తల్లికి క్యాన్సర్ వచ్చిందని, దీంతో తాను ఆంకాలజిస్ట్ కావాలని నిర్ణయించుకున్నానని తెలియజేసింది. ప్రస్తుతం తాను కరోనా రోగులకు చికిత్స అందిస్తు్న్నానని, రోజూ 2 మాస్కులు, గాగుల్స్, ఫేస్ షీల్డ్, పీపీఈ సూట్ ధరించి పనిచేయడం చాలా కష్టమని తెలియజేసిన రూప తనకు సుహాసిని, రాధిక సినిమాలంటే ఎంతో ఇష్టమని.. వాళ్లలా నటించాలని ఉండేదని కూడా తెలియజేసింది.

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈ అందాలా తార 2020 లో ‘ఎం.బి.బి.ఎస్’ పూర్తి చేసింది. ఆ తరువాత డాక్టర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. మరోవైపు భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు కూడా ఇచ్చేది. దర్శకుడు వెంకటేష్ మహా.. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంలో హీరోయిన్ కోసం ఆడిషన్ నిర్వహించాడు. ఈ విషయాన్ని రూప.. తన ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని ఆడిషన్ కు హాజరయ్యింది. అందులో భాగంగా ఈమె చేసిన డ్యాన్స్ కు.. దర్శకుడు వెంకటేష్ మహా, నిర్మాత ప్రవీణ్.. ఫిదా అయిపోయి వెంటనే సినిమాలో ఛాన్స్ ఇచ్చేసారట. సినిమాలో ఈమె ఎంత బాగా డ్యాన్స్ చేసిందో చూసారుగా..! ఆ విధంగా ఈ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న రూపకు.. నిజ జీవితంలో మేకప్ లేకుండా ఉండడం అంటేనే ఇష్టమట. సినిమాలో కూడా అలానే ఉండాలని డైరెక్టర్ చెప్పడంతో ఈమె మరింత ఇష్టంతో ఈ పాత్ర చేసినట్టు తెలుస్తుంది. డ్యాన్స్ లో ఈమె సిద్దహస్తురాలు.. ఈమెకు ఇష్టమైన ఈ 2 విషయాలు కూడా రూపకు బాగా కలిసొచ్చాయని అర్ధమవుతుంది.



























