ప్రపంచం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నా కొందరు మనుషుల ఆలోచనా తీరు ఏ మాత్రం మారడం లేదు. నేటికీ మూఢ నమ్మకాలను విశ్వసిస్తూ కొందరు మంత్రగాళ్లను నమ్ముతున్నారు. వారితో తాంత్రిక పూజలు నిర్వహిస్తూ ఇతరుల్లో సైతం మూఢ నమ్మకాలపై విశ్వాసం పెరిగేలా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మూఢనమ్మకాలను ప్రజలు పెద్దగా పట్టించుకోకపోయినా రాజస్థాన్ లోని భరత్ పూర్ ను మాత్రం మూఢ నమ్మకాలు పట్టిపీడిస్తున్నాయి.

అక్కడి ప్రజలు నేటికీ మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే భరత్ పూర్ లోని మథురా గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ నగర్ కాలనీలో సప్నా దేవి అనే 22 ఏళ్ల యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి జీవించేది. రెండు రోజుల క్రితం సప్నా దేవిని పాము మూడుసార్లు కాటు వేసింది. పాము నిజంగా కాటు వేసిందో సప్నా దేవి ఆ విధంగా భ్రమ పడింతో తెలియదు కానీ వెంటనే ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది.

విషయం తెలిసిన వెంటనే సప్నాదేవి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆమెను పరిశీలించిన వైద్యులు మాత్రం ఆమె శరీరంపై పాము కాటు వేసినట్లు గుర్తులు లేవని ఆమెను ఏ పాము కాటు వేయలేదని చెప్పారు. అయితే వైద్యులు పాము కాటు వేయలేదని చెప్పినా యువతి కుటుంబ సభ్యులు మాత్రం భయాందోళకు గురై పాము కాటుకు మంత్రం వేసే మంత్రగాళ్లను సంప్రదించారు.

8 మంది మంత్రగాళ్లు సప్నాదేవి ఇంటికి చేరుకుని పాముకాటుకు మంత్రం వేస్తామని పూజలు నిర్వహించారు. రాత్రంతా భారీఎత్తున పూజలు జరగడంతో స్థానికంగా ఈ ఘటన సంచలనమైంది. ప్రభుత్వాలు మూఢనమ్మకాలను ప్రోత్సహించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని… మంత్రగాళ్లను పిలిపించే పూజలు నిర్వహించే వాళ్లను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.



























