బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీబీఐ అధికారులు, నార్కోటిక్ అధికారుల విచారణలో వెలుగులోకి వస్తున్న ఆ విషయాలు అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఎన్సీబీ అధికారులు సుశాంత్ మృతి కేసులో టాలెంట్ మేనేజర్ జయా సాహానిని రెండు రోజుల పాటు విచారించారు. విచారణలో జయ సుశాంత్ ఒక సినిమా గురించి చివరిసారి తనతో మాట్లాడాడని ఆమె చెప్పారు.

జయ సుహాని సుశాంత్ కు పలు సినిమాలలో ఆఫర్స్ రావడానికి కారణమైంది. సుశాంత్ పారితోషికం, ఇతర వివరాలు జయ సుహానికి బాగా తెలుసు. డ్రైవ్, చిచ్చోరే, కేదార్ నాథ్, సన్ చురియా సినిమాలలో సుశాంత్ కు ఆఫర్స్ రావడానికి జయనే కారణం. డ్రైవ్ సినిమాకు సుశాంత్ 2.25 కోట్ల రూపాయలు తీసుకోగా దిల్ బెచారాకి మూడున్నర కోట్లు, చిచ్చోరే, సన్ చురియా సినిమాలకు ఐదు కోట్లు, కేదార్ నాథ్ సినిమాకు 6 కోట్లు సుశాంత్ తీసుకున్నట్టు జయ వెల్లడించారు.

గడిచిన నాలుగేళ్లలో 21 బ్రాండ్స్ తో సుశాంత్ కు ఒప్పందం కుదిరేలా చేసినట్టు ఆమె తెలిపారు. కుమార్ మంగళ్ తెరకెక్కించనున్న ఒక సినిమా గురించి సుశాంత్ మొదట 6 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని ఆ తర్వాత 12 కోట్ల రూపాయలు సుశాంత్ డిమాండ్ చేసినట్లు జయ తెలిపారు. సుశాంత్ 2019 డిసెంబర్ నెలలో డిప్రెషన్ కు లోనయ్యాయని తనతో చెప్పాడని ఆమె పేర్కొన్నారు.

ఈ సంవత్సరం మార్చి నెలలో సుశాంత్ ను చివరిసారిగా కలిశానని.. ఆ సమయంలో బెడ్ రూమ్ నుంచి హాల్ కు, హాల్ నుంచి బెడ్ రూమ్ కు తిరుగుతూ సుశాంత్ వింతగా ప్రవర్తించాడని ఆమె వెల్లడించారు. జూన్ 5వ తేదీన చివరిసారిగా సినిమా గురించి సుశాంత్ తో మాట్లాడినట్టు ఆమె తెలిపారు. జయ సాహానీ చేసిన వ్యాఖ్యలతో సుశాంత్ మృతి కేసు కొత్త మలుపులు తిరుగుతోంది.



























