ఆంధ్రుల ఆరాధ్య నేత ఎన్టీరామారావు ఆరోజుల్లో ఏది చేసినా ఒక సంచలనమే. ఎన్టీఆర్ నాటకాలు , సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు…. కాబట్టి అందరి దృష్టిని ఆకట్టుకునే విధంగా వ్యవహరించేవారు. అలాగే ఏదైనా విషయాన్ని రహస్యంగా ఉంచి నాటకీయంగా, ఎవరూ ఊహించని విధంగా ప్రకటించేవారు. అందులో ఎన్టీఆర్ ను మించినవాళ్లు లేరనే చెప్పాలి.

ఒకసారి తిరుపతిలో జరిగిన ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ కి ఎన్టీఆర్ కాషాయ దుస్తులు ధరించి వచ్చి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఎన్టీఆర్ ను ఆ గెటప్ లో చూసిన ఆ ఫంక్షన్ నిర్వాహకులు, ఎన్టీఆర్ ఫాన్స్ షాకయ్యారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఇదేమిటి అని అడగాలనుకున్నారు కానీ ఎవరూ అంత ధైర్యం చేయలేకపోయారు. ఫంక్షన్ ముగిసిన తర్వాత ప్రింట్ మీడియా విలేకర్లు ఆయన వెంటపడి ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ రోజుల్లో ఎలక్ట్రానిక్ మీడియా లేదు కాబట్టి లైవ్ ప్రసారాలు లేవు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన ఎన్టీఆర్ మాట్లాడుతూ.. కాషాయానికి మారడాన్ని సన్యసించడంగా అభివర్ణించారు. ప్రాపంచిక సుఖాలకు ప్రలోభాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయించుకున్నామని అందుకే ఈ కొత్త వేషధారణ అని స్పష్టం చేశారు. ముక్కుపచ్చలారని బాలికను దారుణంగా చెరిచిన సంఘటన తన మనసును కలచి వేసిందని జీవితం పట్ల విరక్తి పుట్టిందని ఎన్టీఆర్ అన్నారు. అధికారంలో ఉండగా సన్యసించడం ఎలా కుదురుతుందని ఒక విలేకరి ప్రశ్నించగా ఎన్టీఆర్ తనను తాను రాజయోగిగా వర్ణించుకున్నారు. అంతే.. ఆ మర్నాడు ఎన్టీఆర్ కాషాయ దుస్తుల విషయం దేశమంతా తెలిసిపోయి ఆ వార్త సంచలనం సృష్టించింది.

ఎన్టీఆర్ కొత్త వేషధారణను చూసి అప్పటి విమర్శకులు, కాంగ్రెస్ నేతలు అవహేళన చేసారు. అయినా ఎన్టీఆర్ లెక్కచేయలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ మాంసాహారం మానేశారు. గండిపేటలో కుటీరం నిర్మించారు. కొంతకాలం అక్కడే నివాసమున్నారు. ఆ విధంగా ఎన్టీఆర్ తలపాగా చుట్టి వివేకానందుడి గెటప్ లో కనిపించేసరికి ఎన్టీఆర్ ను కాంగ్రెస్ నేతలు డ్రామారావు అంటూ విమర్శించేవారు. అయితే ఎన్టీఆర్ కాషాయ దుస్తులు ధరించడానికి స్ఫూర్తి స్వామి అగ్నివేశ్ అని తెలిసింది. మానవ హక్కుల ఉద్యమంలో భాగంగా స్వామి అగ్నివేశ్ ఒకసారి హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ ను కలిశారు. అప్పుడు సీఎం గా ఉన్న ఎన్టీఆర్ కాషాయ వస్త్రాల్లో ఉన్న అగ్నివేశ్ ను చూసి “ఈ దుస్తుల ప్రత్యేకత ఏమిటి.?” తమరు సన్యాసం ఎందుకు తీసుకున్నారు.?” అని స్వామిని ప్రశించారు. అందుకు సమాధానంగా అగ్నివేశ్ “సన్యాసిగా ఉంటే మనకు ఎలాంటి స్వార్ధం ఉండదు. మనం మనకోసం కాకుండా సమాజం కోసం పని చేస్తాం. మీరు నిజాయితీగా పని చేయాలంటే సన్యసించండి” అని చెప్పారట. ఈ మాటలు ఎన్టీఆర్ పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.

ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎన్టీఆర్ కూడా కాషాయ దుస్తులు ధరించి తనని తాను రాజయోగిగా ప్రకటించుకున్నారు. మూడో కంటికి తెలీకుండా దుస్తులు కుట్టించుకుని తిరుపతి వెళ్లి వాటిని ధరించి ఫంక్షన్ కి హాజరయ్యారు. ఈ దుస్తులు ప్రభావం నుంచి బయటపడి మామూలు దుస్తులు ధరించడానికి దాదాపు ఎనిమిదేళ్లు పట్టింది. 92 నాటికి మామూలు దుస్తుల్లోకి వచ్చేసారు. 93లో రెండో పెళ్లి సుకున్నారు. నాటి ఎన్టీఆర్ ని ఇంతిలా ప్రభావితుడిని చేసిన స్వామి అగ్నివేశ్ ఢిల్లీలో చికిత్స పొందుతూ గతరాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. సిక్కోలు ముద్దుబిడ్డ.. ఆర్యసమాజ్‌ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌ ఇక ఒక చరిత్ర. దేశవ్యాప్తంగా జరిగిన అనేక సామాజిక ఉద్యమాలకు, పోరాటాలకు వెన్నుదన్నుగా నిలవడంతోపాటు.. భ్రూణహత్యలు, వెట్టిచాకిరి, మహిళా సమస్యలపై, సామాజిక అంతరాలపై ఆయన ఎత్తిన గొంతు ఈ పుడమిపై ఎల్లకాలం వినిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here