రేపటి (20 ఏప్రిల్) నుంచి తెలంగాణా రాష్ట్రంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గి, జొమాటో సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్. ఆయా ఫుడ్ డెలివరీ యాప్స్ రాష్ట్రంలో ఆర్డర్స్ తీసుకోరాదని స్పష్టం చేసారు. ఫుడ్ డెలివరీల వల్ల చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని, అందువల్ల వాటిని రాష్ట్రములో ఇకపై అనుమతించబోమని తెలిపారు.

అయితే దేశ రాజధాని ఢిల్లీలో ఒక పిజ్జా డెలివరీ బాయ్ కు కరోనా సోకడంతో అతను 60 మందికి అంటించాడని కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఫుడ్ డెలివరీ యాప్స్ ను రాష్ట్రంలో అనుమతించకూడదని నిర్ణయించామని తెలిపారు. అలాగే ప్రజలు కూడా ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవద్దని సుమారు 15 రోజులపాటు బయట తిండి తినకపోవడమే మంచిదని తెలిపారు. వీలైనంత వరకు కిరాణా సరుకులు డెలివరీ చేసుకోవచ్చని స్పష్టం చేసారు.

హైదరాబాద్ లో స్విగ్గి డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్టు తెలుస్తోంది. నాంపల్లికి చెందిన 20 సంవత్సరాల యువకుడికి రెండు రోజుల క్రితం కరోనా టెస్ట్ చేయగా అతనికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు సమాచారం. అయితే అతనికి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదని ప్రాధమికంగా తెలుసుకున్నారు. అతడు ఈ మధ్యకాలంలో ఫుడ్ ఎవరెవరికి డెలివరీ చేసాడు అనే దానిపై ద్రుష్టి పెట్టారు పోలీసులు.



























