Tamil Hero Vijay : ప్రస్తుతం విజయ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తుండగా రష్మిక మందన విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉండగా తాజాగా చెన్నై లోని విజయ్ ఆఫీస్ కు సంబంధించి ఒక వార్త సంచలనం రేపుతోంది. వివరాలలోకి వెళితే తమిళ సూపర్ స్టార్ విజయ్ హెడ్ ఆఫీస్ లో ఒక వ్యక్తి అనుమానస్పద స్థితిలో మరణించాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

తాగిన మత్తులో పరాటా తింటూ….
వివరాలలోకి వెళితే… పనైయుర్, ఈసీఆర్ రోడ్డులో ఉన్న విజయ్ హెడ్ ఆఫీస్‌లో ప్రస్తుతం కొన్ని మరమ్మత్తులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రభాకరన్ అనే పేయింటర్ అక్కడ పని కుదుర్చుకున్నాడు. ఆఫీస్ పేయింటింగ్ నిమిత్తం ప్రభాకరన్ ఒక నెల రోజుల కాంట్రాక్ట్ కూడా కుదుర్చుకున్నాడు. ఇక కొద్దిరోజుల క్రితమే కుటుంబసభ్యుల్ని కలవటానికి ప్రభాకరన్ తన ఇంటికికూడా వెళ్లాడు. అయితే బుధవారం రాత్రి తిరిగి వచ్చిన ప్రభాకరన్ ఫుల్లుగా తాగిఉన్న సమయంలో, పరోటా తినటానికి వంద రూపాయలు ఇవ్వాలని సూపర్ వైజర్‌ని అడిగాడు. అందుకు సూపర్ వైజర్ 100 రూపాయలు ఇచ్చాడు. అయితే మరుసటి రోజు ఉదయం 8 గంటల సమయంలో ఆఫీస్ లో ప్రభాకరన్ చనిపోయి కనిపించాడు. చనిపోయిన సమయంలో అతని నోటిలో, చేతిలో పరోటా వుంది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మద్యం మత్తులో వుండి పరోటా తినటం వల్ల అది కాస్తా గొంతులో ఇరుక్కుని ప్రభాకరన్ చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.































