TDP Politics : ఏపీలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలతోనే అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రధాన పార్టీలు రెండింటినీ అలెర్ట్ చేశాయి. దీంతో పార్టీలు రెండూ ఎన్నికలకు సిద్ధమైపోతున్నాయి. ఓ పార్టీ అయితే ఏకంగా పార్టీకి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో మునిగిపోయింది. ఈ విషయంలో టీడీపీ ముందుంది అనే చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఇచ్చిన జోష్‌తో టీడీపీ దూసుకెళుతోంది. ఎన్నికలకు అవసరమైన అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.

వందకు పైగా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిందని కూడా టాక్ నడుస్తోంది. అయితే రెండు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను మాత్రం ఇప్పటికే ప్రకటించేసింది. ఆ ఇద్దరు ఎవరు? అధినేత చంద్రబాబు లెక్క కరెక్టేనా? లేదంటే సింపతీ కోణంలో ఆలోచించి తప్పులో కాలేస్తున్నారా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీసుకున్న నిర్ణయం మాదిరిగానే ఈ నిర్ణయం కూడా పార్టీకి కలిసొస్తుందా? తదితర విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

తీవ్ర మానసిక వేదనకు గురైన నారాయణ..
నెల్లూరు సిటీ నియోజకవర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థిని ఖరారు చేశారు . నెల్లూరు సిటీ నుంచి ఈ సారి మాజీ మంత్రి పొంగూరు నారాయణ బరిలోకి దిగుతారని వెల్లడించారు. ఇక విజయనగరం నుంచి అశోక్ గజపతి రాజు సైతం బరిలోకి దిగుతారని ప్రకటించారు. టీడీపీ నుంచి ఎన్నో ఊహాగానాలు ఉన్నప్పటికీ ముందుగా బయటకు వచ్చిన పేర్లు మాత్రం వీరిద్దరివే. గత కొంతకాలంగా నారాయణ ప్రభుత్వ వేధింపులను ఎదుర్కొంటూ వస్తున్నారు. పదో తరగతి ప్రశ్నా పత్రం లీకేజీలో ఆయన పాత్ర ఉందని జైలుకు పంపించడం.. ఆపై ఆయనతో పాటు ఆయన కుటుంబంపై సీఐడీ రైడ్స్.. వంటి వాటి కారణంగా ఆయనకు తీవ్ర మానసిక వేదనకు గురవుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈసారి పోటీకి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదనే వార్తలు వచ్చాయి. దీంతో చంద్రబాబు నారాయణను పిలిపించి మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తాను సర్వే చేయించానని.. భారీ ఆధిక్యంతో గెలుస్తారని సర్వేలు చెబుతున్నాయన్న చంద్రబాబు చెప్పడంతో ఆయన సైతం పోటీకి ఓకే చెప్పినట్టు సమాచారం.

మాన్సాస్ ట్రస్ట్ నుంచి అశోక్ గజపతిరాజు తొలగింపు..
ఇక పూసపాటి అశోక్ గజపతి రాజు పరిస్థితి కూడా నారాయణకు ఏమీ భిన్నంగా లేదు. ఆయన విజయనగర రాజ వంశానికి చెందిన వారు. ఆయన నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రిగా పని చేశారు. అశోక్ గజపతి రాజు 25 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికవుతూ వచ్చారు. ఏపీ ప్రభుత్వంలో 13 ఏళ్ల పాటు మంత్రిగా పని చేశారు. అలాంటి అశోక్ గజపతిరాజును వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇబ్బందులు సృష్టించింది. మాన్సాస్, సింహాచలం ట్రస్టు చైర్ పర్సన్‌గా అశోక్ గజపతిరాజును తొలగించి ఆయన స్థానంలో సంచయిత గజపతిరాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన హైకోర్టుకు వెళ్లడం.. ఆయనకు సానుకూలంగా తీర్పు రావడం వంటివి జరిగాయి. మాన్సాస్ ట్రస్టు పరిధిలోనే సింహాచలంతోపాటు 108 ఆలయాలు ఉన్నాయి. తమిళనాడులో కూడా మాన్సాస్ ట్రస్ట్‌కు భూములున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే జీవో నెం.72 అనేది సంచలనంగా మారింది. మొత్తానికి ఇటీవలి కాలంలో పరిస్థితులన్నీ చక్కబడి ఆయన కూడా అసెంబ్లీకి పోటీ చేయనున్నారు.

మరి చంద్రబాబు లెక్క కరెక్టేనా?
మరి అశోక్ గజపతిరాజు, నారాయణలను అసెంబ్లీకి పంపాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సబబేనా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి 2019 ఎన్నికలకు ముందు మాత్రం నారాయణపై చాలా విమర్శలు వచ్చాయి. చివరకు ఆయన కుమారుడు యాక్సిడెంట్‌లో మరణిస్తే కూడా జనం ఒకరకంగా సింపతీ చూపలేని పరిస్థితి. ఎందరో పేద కుటుంబాల నుంచి నిర్ధాక్షిణ్యంగా ఫీజులు వసూలు చేశారని.. ఎందరినో విద్యార్థులను నారాయణ కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెట్టిందంటూ విమర్శలు వచ్చాయి. ఆ పాప ఫలితమే ఆయన కుమారుడిని పోగొట్టుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే ఇటీవలి కాలంలో ఆయనపై పెద్దగా విమర్శలైతే ఏమీ లేవు. తరచూ ప్రభుత్వ వేధింపులకు గురవడం కారణంగా సింపతీ అయితే వచ్చి ఉండొచ్చు కూడా. ఇక అశోక్ గజపతి రాజుకు కూడా అంతే. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ఆయనకు పెద్ద ఎత్తున సపోర్ట్ వచ్చింది. చంద్రబాబు సర్వేలు నిజం అయ్యే అవకాశాలు లేకపోలేదు.
హాట్ టాపిక్‌గా నెల్లూరు..

ముఖ్యంగా రాజధాని అమరావతికి అవసరమైన భూముల సేకరణలో నారాయణ కీలక పాత్ర పోషించారు. రాజ రైతులను ఒప్పించి వారి నుంచి భూములు సేకరించారు. అంతేకాకుండా సీఆర్డీఏ రూపకల్పనలోనూ ఆయన కృషి చాలా ఉందనే చెప్పాలి. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారాయణను ఇరుకున పెట్టే నిర్ణయాలు తీసుకుంది. సీఆర్డీఏ భూముల్లో అవకతవకలు జరిగాయంటూ నారాయణపై కేసు నమోదు చేసింది. నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సారి కూడా ఆయన తప్పక బరిలో నిలుస్తారు. అయితే అనిల్‌పై వ్యతిరేకత బాగానే ఉందని సమాచారం. ఇవన్నీ నారాయణకు కలిసొస్తాయని చంద్రబాబు లెక్కలేస్తున్నారు. ఇటు నారాయణ, అటు అశోక్ గజపతి రాజు.. మొత్తానికి చంద్రబాబు గట్టి స్కెచ్చే వేశారు. ఇక టీడీపీ తరపున నారాయణ బరిలోకి దిగుతుండడంతో నెల్లూరు నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారడం ఖాయం.