కరోనా సమయంలో తీసుకోవాల్సిన అన్నీ జాగ్రత్తలతో బిగ్‌బాస్ సీజన్ 4 బుల్లితెరపైకి వచ్చింది. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి, అందరికీ పరీక్షలు చేసి నెగెటివ్ అని తేలిన తర్వాతనే హౌస్ లోకి పంపించారు. కరోనా కారణంగా తక్కువ మంది సిబ్బందితో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ఆ కొద్దిమంది కూడా కరోనా నిబంధనలను తూచ తప్పకుండా పాటిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో అందరూ చక్కగా వినోదాన్నిఅందిస్తున్నారు. అయితే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో కరోనా మహమ్మారి పంజా విసిరింది. ఈ షోలో పనిచేసే కొందరు టెక్నీషియన్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తాజా సమాచారం.

అంతేకాకుండా ఈ సీజన్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తెలంగాణా ఫోక్ సింగర్ గంగవ్వ కూడా అస్వస్థతకు గురైనట్లు కనిపిస్తోంది. కొద్ది రోజులుగా ‘నేను ఇంటికి వెళ్లిపోతా.. నా మనవళ్లను, మనవరాళ్లను చూడాలని ఉంది’ అని గంగవ్వ అంటున్న విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున మాత్రం అందుకు ఒప్పుకోకుండా “నువ్వు ఇంట్లో ఉండాలన్నా, పోవాలన్నా డిసైడ్ చేసేది ప్రేక్షకులే.!” అని తేల్చి చెప్పేసారు. లేటెస్ట్ గా టెక్నీషియన్లకు కరోనా సోకడంతో ముందు జాగ్రత్తగా గంగవ్వకు కూడా కోవిడ్-19 పరీక్ష చేయించారట. ఆ ఫలితాలు ఇంకా రావాల్సి ఉందంటున్నారు.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన షో నిర్వహకులు మరిన్ని కఠినమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇంతవరకూ జరిగిన షోలో గంగవ్వ వరుసగా రెండోసారి కూడా ఎలిమినేషన్ లిస్టులో ఉంది. కానీ, ప్రేక్షకులు ఆమెకు విపరీతంగా ఓట్లు వేస్తూ మద్దతునిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉండలేనని మాటిమాటికీ చెప్తుండటంతో బిగ్‌బాస్ నిర్వాహకులే ఓ అడుగు ముందుకేసి ఆమెను త్వరలోనే బయటకు పంపించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.



























