వివిధ దశల్లో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ సర్కార్ 2018 వానాకాలం సీజన్ నుంచి ‘రైతుబంధు’ పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ యాసంగి సీజన్‌లోనూ రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. ఇందుకు సంబంధించిన నగదును ఈ నెల 15వ తేదీ నుంచి రైతుల అకౌంట్లలో జమ కానుంది. అంటే ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలిఉంది.

ఎకరానికి 5 వేల రూపాయల చొప్పున సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు ఏకంగా 7,500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖ ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
వానాకాలం సీజన్‌కు సంబంధించి జూన్ నెలలో 60.84 లక్షల మంది రైతులకు రైతు బంధు సాయం కింద రూ.7,360.41 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ యాసంగి సీజన్‌లో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతుల సంఖ్య, అందుకు అనుగుణంగా భూవిస్తీర్ణం పెరిగితే బడ్జెట్ కూడా పెరగనుంది.
ఏమైనా సమస్యలు ఉంటే.. స్థానిక వ్యవసాయాధికారిని సంప్రదించాలని అధికారులు కోరారు. తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలుపెట్టి, ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల వరకు అందరికీ పది రోజుల వ్యవధిలో డబ్బులు జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గత ఏడాది కూడా ఇదే మాదిరిగా పంపిణీ చేశారు. ఈ సారి కూడా ఇదే పద్ధతిని ఫాలో కానున్నారు.































